ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సీఐఎల్) ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడాలో ఉన్న ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేసింది. ఇకపై కార్ల ఉత్పత్తి మొత్తం రాజస్థాన్‌లోని తపుకరాలో మాత్రమే జరగనుంది. నొయిడాలో కంపెనీ కార్పొరేట్ హెడ్ ఆఫీస్‌తో పాటు స్పేర్‌పార్ట్స్ డివిజన్, రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ కేంద్రం, ఇతర కార్యకలాపాలు మాత్రమే కొనసాగనున్నాయి.
జపాన్‌కు చెందిన హోండా దేశీయంగా కార్ల ఉత్పత్తి కోసం నొయిడాలో 1997లో ప్లాంట్‌ను నెలకొల్పింది. అయితే, ప్లాంట్ ఉత్పాదకత, సామర్థ్యం పెంపునకు ఈ ఏడాది తొలినాళ్లలో ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ప్రకటించింది. తాజాగా మూసివేత నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పందించేందుకు కంపెనీ నిరాకరించింది. గ్రేటర్ నొయిడాలో హోండాకు చెందిన సిటీ, సీఆర్-వి, సివిక్ మోడళ్లు ఉత్పత్తి అయ్యేవి. ఈ ప్లాంట్ సామర్థ్యం లక్ష యూనిట్లు కాగా.. తపుకరా ప్లాంట్ సామర్థ్యం 1.8 లక్ష యూనిట్లుగా ఉంది. ఇతర దేశాలకు సైతం తపుకరాలో తయారైన ఇంజిన్లు ఎగుమతి అవుతున్నాయి.
మరోవైపు గతేడాది నవంబర్‌లో 6,549 వాహనాలు మాత్రమే విక్రయించిన హోండా.. ఈ ఏడాది నవంబర్‌లో 9,900 యూనిట్లు విక్రయించింది.
ఇదీ చూడండి: టీకా రవాణాకు 'స్పైస్ ఎక్స్‌ప్రెస్'తో షాడోఫాక్స్ జట్టు