భారత్లో అంతర్జాల వినియోగదారుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మీడియా రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఫిక్కీ-ఈవై విడుదల చేసిన తాజా నివేదికే అందుకు నిదర్శనం. 2019 నాటికి చలన చిత్ర వినోద రంగాన్ని, 2021 నాటికి ప్రింట్ మీడియా రంగాన్ని అధిగమించి సుమారు రూ. 35,700 కోట్లకు చేరుకుంటుందని ప్రకటించింది.
- 2018లో చిత్ర పరిశ్రమ వ్యాపారం రూ.17,500 కోట్లుగా నమోదయింది. అది 2019లో రూ.19,600 కోట్లకు చేరుకోవచ్చని నివేదిక అంచనా వేసింది.
- 2018లో రూ. 30,800 కోట్లుగా ఉన్న ప్రింట్ మీడియా రంగం.. 2021 నాటికి రూ.33, 600 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.
- 2018లో డిజిటల్ మీడియా వ్యాపారం 42 శాతం వృద్ధితో రూ.16,800 కోట్లకు చేరుకుంది. భారతీయులు మొబైల్ వినియోగ సమయంలో 30 శాతం వినోదానికే కేటాయిస్తున్నారు. దీని ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం డిజిటల్ మీడియా సుమారు రూ.22,400 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
రెండో స్థానంలో...
ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాల వినియోగదారుల జాబితాలో 57 కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లతో భారత్ రెండోస్థానంలో ఉంది. ఈ సంఖ్య ఏటా సుమారు 13 శాతం మేర పెరుగుతోంది. 2018లో ఆన్లైన్ వీడియో వీక్షకుల సంఖ్య 32.5 కోట్లుగా ఉంది. ఆన్లైన్ మ్యూజిక్ తదితర ఆడియో సేవలు పొందుతున్న వారి సంఖ్య 15 కోట్లకు చేరింది. 2021 నాటికి ఈ సంఖ్య గణనీయంగా పెరగనుంది.
భారతీయ మీడియా, వినోద రంగం వ్యాపార పరిమాణం 2017 నాటికి 23.9 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అది 2021 నాటికి 33.6 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని నివేదిక అంచనా వేసింది.
ఇదీ చూడండి: 'భారత్మాలా'కు ఎల్ఐసీ రూ. 1.25 లక్షల కోట్ల రుణం