బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 74శాతానికి పెంచే చట్ట సవరణ బిల్లుకు.. విపక్షాల ఆందోళనల మధ్యే ఆమోదం తెలిపింది రాజ్యసభ. వాయిస్ ఓటుతో బిల్లును ఆమోదించారు ఛైర్మన్.
బీమా చట్ట సవరణ బిల్లు-2021ను రాజ్యసభలో ప్రవేశపెట్టిన అనంతరం విపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. నియంత్రణ సంస్థలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చామని తెలిపారు. విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచటం వల్ల బీమా సంస్థలకు అవసరమైన మూలధనం సమకూరుతుందన్నారు.
"విదేశీ ప్రత్యక్ష పెట్టుడులను 74 శాతానికి పెంచటం వల్ల బీమా సంస్థలకు అవసరమైన మూలధనం లభిస్తుంది. బీమా రంగంలోని నియంత్రణ సంస్థలతో విస్తృత చర్చల తర్వాతే ఈ బిల్లును తీసుకొచ్చాం. 2015లో ఎఫ్‌డీఐలను 49 శాతానికి పెంచటం వల్ల రూ.26 వేల కోట్లు వచ్చాయి. ప్రస్తుతం బీమా సంస్థలు నగదు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. "
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి.
రాజ్యసభలో వాయిదాల పర్వం.
అంతకముందు.. బీమా చట్ట సవరణ బిల్లు-2021ను పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపాలని విపక్షాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. బిల్లుపై చర్చ సందర్భంగా నిరసనలతో నాలుగుసార్లు వాయిదా వేశారు. అనంతరం బిల్లుపై ఆర్థికమంత్రి మాట్లాడారు. అది ముగిసిన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలో సభ శుక్రవారానికి వాయిదా పడింది.
ఇదీ చూడండి: 'బాధితురాలితో రాఖీ' తీర్పుపై సుప్రీం అసహనం