దేశంలో కార్లపై విధిస్తున్న అధిక సుంకాలు, పన్నుల వల్లే, అత్యధికులు కొనుగోలు చేయలేకపోతున్నారని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్.సి.భార్గవ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచంలో మరే దేశం కన్నా, మనదేశంలోనే కార్లపై పన్నులు అధికంగా ఉన్నాయని తెలిపారు. జపాన్‌లో 10 శాతం పన్ను ఉంటే, ఐరోపాలో 19 శాతం వ్యాట్ మాత్రమే ఉందని, మరే పన్నులు ఉండవన్నారు.
2025 నాటికి జీడీపీలో తయారీరంగ వాటా 25 శాతానికి చేరాలంటే, కార్ల అమ్మకాలు వేగంగా జరగాల్సి ఉందని 2019-20 వార్షిక నివేదికలో భార్గవ వివరించారు. కారు కొనుగోలు ధర పెరగడానికి తోడు రుణం పొందడం భారమైనందునే, విక్రయాలు తగ్గాయని పేర్కొన్నారు. వాహన రగంలో 50 శాతం వాటా కార్లదని, తయారీ రంగంలో 40 శాతం వాటా వాహన రంగానిదని ఆయన గుర్తు చేశారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నుంచి కొవిడ్ ప్రభావం వాహన రంగంపై పడిందని తెలిపారు.
దేశంలో ప్రయాణికుల వాహనాలకు 28 శాతం జీఎస్‌టీ రేటుతో పాటు 1-22 శాతం సుంకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు.
గ్రామీణ ప్రాంతాలే ఆదుకుంటాయ్
వర్షపాతం బాగున్నందున, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి, వాహన అమ్మకాలు బాగుంటాయనే అంచనాను భార్గవ వ్యక్తం చేశారు. ట్రాక్టర్ల అమ్మకాలు గతేడాది కంటే పెరిగాయని తెలిపారు. మారుతీ సుజికీ విక్రయాలు కూడా పట్టణాల కంటే గ్రామాల్లో అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో అమ్మకాలు, గతేడాది ఇదే సమయం స్థాయిలో ఉండొచ్చని, 2021-22 మెరుగ్గా ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిన్న హ్యాచ్‌బ్యాక్ కార్లు, పెట్రోల్-సీఎన్‌జీ విభాగాలకు అధిక ఆదరణ లభిస్తోందన్నారు. డీజిల్ వాహనాలకు గిరాకీ కొనసాగితే, వాటిని తయారు చేస్తామని పేర్కొన్నారు.