జీవితం అనేది సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణంలో అనేక మలుపులుంటాయి. ఇందులో మంచి, చెడు రెండూ ఉంటాయి. మన జీవితంలో ఎదురయ్యే విచారకర సంఘటనలు మనల్ని ఆర్థికంగా కుంగదీస్తాయి.
మనల్ని ఆర్థికంగా దెబ్బతీసే వాటిలో ముందుంటాయి ఆరోగ్య సమస్యలు. కార్పొరేట్ ఆసుపత్రుల బిల్లులు చెల్లించలేక... ఉన్న పొలాలు, ఇళ్లు అమ్ముకున్న వారిని చుస్తున్నాం. ఇక కుంటుంబానికి ఆధారమైన వ్యక్తి ఆసుపత్రి పాలైతే ఆ కుంటుంబం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు, మీ కుటుంబం ఆరోగ్యపరంగా ధీమాగా ఉండాలంటే ఆరోగ్య బీమా కచ్చితంగా కావాల్సిందే.
ఈ మధ్యకాలంలో ఆరోగ్య బీమాపై ప్రజల్లో అవగాహన బాగానే పెరిగింది. రోజు రోజుకు వృద్ధి చెందుతున్న ఆరోగ్య బీమా సంస్థల మార్కెట్లను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కానీ ఏ సమస్యకు ఏ బీమా ఎంచుకోవాలనే దానిపై చాలామంది అయోమయంలో ఉన్నారు.
ఆరోగ్య బీమాలపై సర్వే:
భారత్‌లో చాలామంది తమకి కావాల్సిన పరిమితి కంటే తక్కువ బీమా కలిగి ఉన్నారని ఓ సర్వే పేర్కొంది. ఇందులో ఉద్యోగులు ముందు వరుసలో ఉండటం గమనించాల్సిన విషయం. ఆరోగ్య బీమాపై భారతీయులు అతి తక్కువ ఖర్చు చేస్తారని ఆ సర్వే తెలిపింది. 95 శాతం మధ్యతరగతి వారికి అవసరమైన స్థాయిలో ఆరోగ్య బీమా లేదని ఆ సర్వే స్పష్టం చేసింది.
45 ఏళ్లు పైబడిన వారిలో తమ అనారోగ్యానికి చికిత్సకు అవసరమైన దానికన్నా తక్కువ బీమా ఉన్న వారి శాతం 69. మధ్య వయస్కుల్లో ఈ శాతం 62.
సగటున 5- 6 లక్షల విలువైన ఆరోగ్య బీమాలను భారతీయులు కొనుగోలు చేస్తున్నారని సర్వే స్పష్టం చేసింది. అయితే నేటి కాలంలో వైద్య ఖర్చుల సరళిని పరిశీలిస్తే ఇది చాలా తక్కువ. ఈ సమస్యను అర్థం చేసుకున్న బీమా సంస్థలు కొన్ని పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. వీటిలో సూపర్-టాప్ అప్ పథకం ఒకటి.
సూపర్- టాప్ అప్ ప్లాన్ :
మీ సాధారణ ఆరోగ్య బీమా పథకానికి ఈ సూపర్-టాప్ అప్ కలిపితే అవసరమైన సమయంలో మీ బీమా పరిమితి కంటే అధిక సొమ్ముని పొందవచ్చు. దీని వల్ల మీ బీమా పథకంతో సంబంధం లేకుండా ఆసుపత్రి ఖర్చుల మొత్తానికి చెల్లింపులు జరుగుతాయి.
బీమా సొమ్ము పరిధి దాటిన డబ్బుని మీరు తరువాత నిదానంగా చెల్లించవచ్చు.
ఉదాహరణకు మీకు 5 లక్షల ఆరోగ్య బీమా ఉందనుకొందాం. మీరు సూపర్-టాప్-ప్లాన్‌తో మరో 10 లక్షల సొమ్ము జత చేశారు. ఇప్పుడు మీ బీమా సొమ్ము మొత్తం 15 లక్షలు. మీరు అ సంవత్సరం 13 లక్షలు వైద్య ఖర్చుల కోసం క్లైయిమ్ చేస్తే అందులో 5 లక్షల రూపాయలు సాధారణ బీమా కింద మరో 8 లక్షల రూపాయలు సూపర్-టాప్-ప్లాన్ కింద కలుస్తాయి.
-అమిత్ చాబ్రా, ఆరోగ్య బీమా విభాగాధిపతి, పాలసీ బజార్.కామ్