గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీయ ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ.. విశ్లేషకుల అంచనాలకు మించి రాణించింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికరలాభం 15.8 శాతం పెరిగి రూ. 8,434కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం రూ. 7,280 కోట్లుగా ఉంది.
13.6 శాతం పెరిగిన ఏకీకృత నికరలాభం
గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఏకీకృత నికరలాభం 13.6శాతం పెరిగి రూ. 10,43,671 కోట్లుగా ఉందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అయితే గతేడాదికి గాను మొత్తం ఆదాయం 16.8 శాతం వృద్ధి చెంది రూ. 31,833 కోట్లకు చేరింది.
కరోనా నేపథ్యంలో థర్డ్ పార్టీ ఉత్పత్తుల విక్రయాలు తగ్గాయని.. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం సైతం తగ్గిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. అలాగే కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎలాంటి డివిడెండు ప్రకటించొద్దని బోర్డు నిర్ణయించింది.
ఇదీ చూడండి: క్యూ4 ఫలితాల్లో దుమ్మురేపిన టీసీఎస్