వస్తు, సేవల పన్ను నెట్వర్క్ (జీఎస్టీఎన్) జీఎస్టీ హెల్ప్‌డెస్క్ కోసం కొత్త టోల్ ఫ్రీ నంబర్‌ను బుధవారం తీసుకొచ్చింది. ఇది పరోక్ష పన్నులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి 365 రోజులు పనిచేస్తుందని స్పష్టం చేసింది.
కొత్త టోల్ ఫ్రీ నెంబర్
జీఎస్టీఎన్ కొత్త జీఎస్టీ హెల్ప్‌డెస్క్ టోల్ ఫ్రీ నంబర్ '1800 103 4786'ను ప్రవేశపెట్టింది. ఇది సంవత్సరంలో 365 రోజులూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుంది.
పాత నెంబర్ బంద్
కొత్త టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చిన నేపథ్యంలో జీఎస్టీ హెల్ప్‌డెస్క్ పాత నంబర్ (0120-24888999)ను నిలిపివేసినట్లు జీఎస్టీఎన్ స్పష్టం చేసింది.
పన్ను చెల్లింపుదారుల కోసం
జీఎస్టీ వ్యవస్థను మరింత దృఢంగా, పారదర్శకంగా మార్చడం ద్వారా పన్ను చెల్లింపుదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని జీఎస్టీఎన్ తెలిపింది. అందుకే జీఎస్టీ హెల్ప్‌డెస్క్‌లో కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టి పునరుద్ధరించినట్లు స్పష్టం చేసింది.
10 భాషల్లో
జీఎస్టీఎన్.... జీఎస్టీ హెల్ప్‌డెస్క్‌లో 10 కొత్త భాషలను కూడా ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు పన్ను చెల్లింపుదారులకు కేవలం హిందీ, ఆంగ్ల భాషలు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజా ఫీచర్‌తో బెంగాలీ, మరాఠీ, తెలుగు, గుజరాతీ, కన్నడ, ఒడియా, మలయాళం, పంజాబీ, అస్సామీ భాషలు అందుబాటులోకి వచ్చాయి.
అంతే కాకుండా గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్ వెర్షన్‌ను కూడా మెరుగుపరిచారు. జీఎస్టీ హెల్ప్‌డెస్క్‌కు ప్రతి రోజూ సగటున 8,000 నుంచి 10,000 కాల్స్ వస్తుంటాయి.
ఇదీ చూడండి: 'ఆర్థికవ్యవస్థపై కరోనా ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం'