వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో కొన్ని మార్పులకు ఆర్థిక మంత్రిత్వ ప్రతిపాదనలు చేయనుంది. బిజినెస్-టూ-బిజినెస్ అమ్మకాల్లో ఈ-ఇన్వాయిస్ ఇచ్చే సంస్థ కనీస టర్నోవరును రూ.50 కోట్లకు పరిమితం చేయాలని కోరుతోంది. ఈ విషయమై జూన్ 20న సమావేశమయ్యే జీఎస్టీ మండలి తుది నిర్ణయం తీసుకోనుంది.
2017-18లో రిటర్న్ దరఖాస్తులను పరిశీలిస్తే.... 68,041 సంస్థలు రూ.50 కోట్లకన్నా ఎక్కువ టర్నోవరు ఉన్నట్లు తెలిపాయి. జీఎస్టీ ఆదాయంలో 66.66 శాతం వాటా ఈ సంస్థల నుంచి వచ్చిందే. జీఎస్టీ చెల్లింపుదారుల సంఖ్యపరంగా పెద్ద సంస్థలు 1.02శాతమే. అయితే... 30శాతం ఈ-ఇన్వాయిస్లను ఈ సంస్థలే ఇస్తున్నాయి.
పన్ను ఎగవేతకు అడ్డుకట్ట
ప్రస్తుత విధానంలో అమ్మకం నమోదు, రిటర్న్ దాఖలుకు మధ్య చాలా సమయం పడుతోంది. కొత్త పద్ధతి అమల్లోకి వస్తే రిటర్న్ దాఖలు, ఇన్వాయిస్ అప్లోడ్ శ్రమ తగ్గుతుంది.
ప్రభుత్వపరంగా చూస్తే పన్ను ఎగవేత, ఇన్వాయిస్ల దుర్వినియోగాన్ని తగ్గించవచ్చు. సులభతర వాణిజ్యానికి ఈ-ఇన్వాయిస్ మరింత దోహదం చేస్తుంది. సెప్టెంబర్‌లోపు ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖ భావిస్తోంది.
ఇదీ చూడండి: 'ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే నెఫ్ట్'