మార్చి 1 నుంచి లాటరీలపై 28 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూలు చేయనున్నారు. 2019 డిసెంబర్లో ప్రభుత్వ, అధీకృత లాటరీలపై ఒకే రేటును (28 శాతం) విధించాలన్న నిర్ణయం మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది జీఎస్టీ మండలి.
14+14
రెవెన్యూ శాఖ లాటరీలపై... మునుపటి కేంద్ర పన్ను నోటిఫికేషన్ను సవరించి, కొత్త జీఎస్టీ రేటును నిర్ణయించింది. దీని ప్రకారం లాటరీలపై కేంద్ర పన్ను రేటును 14 శాతానికి సవరించారు. ఇంతే పన్నును రాష్ట్రాలు కూడా విధిస్తాయి. ఈ రెండు కలిసి మొత్తంగా 28 శాతం జీఎస్టీ అవుతుంది.
ప్రస్తుతం
ప్రస్తుతం ప్రభుత్వాలు నడుపుతున్న లాటరీలపై 12 శాతం జీఎస్టీ ఉండగా, రాష్ట్ర అధీకృత లాటరీలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
లాటరీలపై ఏకరీతి పన్ను రేటు విధించాలని డిమాండ్లు వచ్చాయి. ఫలితంగా జీఎస్టీ రేటును సూచించడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేశారు. దీని తరువాత 2019 డిసెంబర్లో ప్రభుత్వ, అధీకృత లాటరీలపై ఒకే రేటును (28 శాతం) విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
'కొన్ని రాష్ట్రాల్లో లాటరీల రూపంలో జూదం ఆడడానికి అనుమతి ఉంది. ఇది పూర్తిగా అక్కడి క్షేత్రస్థాయి వ్యవస్థల్లోకి చొచ్చుకుపోయింది. కొత్తగా పన్ను రేటును నిర్ణీత తేదీ నుంచి పెంచడం వల్ల... డీలర్లు సమర్థంగా దీనిని అమలు చేయగలుగుతారు.' అని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ భాగస్వామి రజత్ మోహన్ అన్నారు.
ప్రభుత్వ, అధీకృత లాటరీలపై ఏకరీతి పన్ను రేటు విధించడం వల్ల వ్యాపారంలో అందరికీ సమాన అవకాశం లభిస్తుందని ఈవై టాక్స్ పార్టనర్ అభిషేక్ జైన్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: గూగుల్ 'అభిరుచి'- వంటలు నేర్చుకోవటానికి కొత్త యాప్