భారతదేశ ఆర్థిక మందగమనం తాత్కాలికంగా కనిపిస్తోందని, త్వరలోనే వృద్ధి ఊపందుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టిలినా జార్జివా అభిప్రాయపడ్డారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
"ప్రస్తుతం ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక విధానాలు మరింత దూకుడుగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. నిర్మాణాత్మక సంస్కరణలు, మరింత చైతన్యం కావాలని ఆశిస్తున్నాం."
- క్రిస్టిలినా జార్జివా, ఐఎంఎఫ్ చీఫ్
అభివృద్ధి చెందుతున్న దేశాలు మందగమనం నుంచి ఆర్థిక పురోభివృద్ధి వైపు పయనిస్తున్నాయని క్రిస్టిలినా అభిప్రాయపడ్డారు. వీటిలో భారత్‌తో పాటు ఇండోనేసియా, వియత్నాంలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.
మెరుగు కనిపిస్తోంది..
ఐఎంఎఫ్ తన 'వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్'ను 2019 అక్టోబర్‌లో విడుదల చేసింది. నాటితో పోల్చితే 2020 జనవరిలో ప్రపంచం చాలా మెరుగైన స్థితిలో కనిపిస్తోందని క్రిస్టిలినా అన్నారు. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం జరగడం, సుంకాల తగ్గింపునకు మార్గం సుగమం కావడమే ఇందుకు కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, 3.3 శాతం వృద్ధిరేటు మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మంచి విషయం కాదన్నారు.
ఆఫ్రికా దేశాలు
కొన్ని ఆఫ్రికా దేశాలు చాలా బాగా పనిచేస్తున్నాయని, అయితే మెక్సికో లాంటి మరికొన్ని దేశాల పరిస్థితి భిన్నంగా ఉందని క్రిస్టిలినా తెలిపారు.
ఇదీ చూడండి: రూపాయి బలహీనం.. పసిడి ప్రియం