Foreign Investment: భారత స్థిరాస్తి రంగంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. 2017-21 మధ్య స్థిరాస్తిలో విదేశీ పెట్టుబడులు అంతక్రితం అయిదేళ్లతో పోలిస్తే మూడింతలు పెరిగి 23.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.80 లక్షల కోట్ల)కు చేరాయని కొలియర్స్-ఫిక్కీ నివేదిక వెల్లడించింది. 2016లో తీసుకొచ్చిన సంస్కరణలతో భారత స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ మదుపర్లు ఆసక్తి చూపుతున్నట్లు కొలియర్స్ తెలిపింది. పారదర్శకత లేని కారణంగా అంతకుముందు పెట్టుబడులకు దూరంగా ఉన్న విదేశీ మదుపర్లు, 2017 నుంచి ఆశావహ వైఖరి చూపుతున్నట్లు నివేదిక వివరించింది.
- 2012-16 మధ్య స్థిరాస్తిలో విదేశీ పెట్టుబడులు 7.5 బిలియన్ డాలర్లు కాగా.. 2017-21 మధ్య 23.9 బిలియన్ డాలర్లకు చేరాయి.
- 2012-21 మధ్య భారత స్థిరాస్తిలో మొత్తం పెట్టుబడులు 49.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇందులో విదేశీ వాటా 64 శాతంగా ఉంది. 2017-21 మధ్య భారత స్థిరాస్తిలో విదేశీ పెట్టుబడుల వాటా 82 శాతానికి చేరింది. అంతక్రితం అయిదేళ్లలో ఇది 37 శాతం మాత్రమే.
- 2017-21 మధ్య మొత్తం విదేశీ పెట్టుబడుల్లో కార్యాలయ విభాగంలోకి 43 శాతం, మిశ్రమ వినియోగ విభాగంలో 18 శాతం చొప్పున వెళ్లాయి. మూడోస్థానంలో పరిశ్రమలు, లాజిస్టిక్స్, నాలుగో స్థానంలో గృహ రంగాలు నిలిచాయి.
- ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం, గృహ విక్రయాల మందగమనం తర్వాత గృహ విభాగంలో విదేశీ మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గృహ సముదాయాల్లో విదేశీ పెట్టుబడులు 37 శాతం నుంచి 11 శాతానికి తగ్గడమే ఇందుకు నిదర్శనం.
- కార్యాలయ విభాగంలోకి విదేశీ పెట్టుబడులు 2017 నుంచి ఏటా స్థిరంగా 2 బిలియన్ డాలర్ల చొప్పున వచ్చాయి. 2021లో మాత్రం పెట్టుబడులు సగానికి తగ్గాయి.
ఇదీ చూడండి: Russia-Ukraine conflict: భారీగా పెరగనున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు!