జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్ ఆ సంస్థ బోర్డు నుంచి వైదొలిగారు. రెండు సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కారణంగా సంస్థ వ్యవహారాల నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. 25 ఏళ్లుగా విమానయాన రంగంలో కొనసాగుతున్నారు నరేశ్ గోయల్.
విమానయానానికి ఎదురుదెబ్బ...
నరేశ్ గోయల్ సంస్థ బోర్డును వీడడం విమానయాన రంగానికి పెద్ద ఎదురుదెబ్బ అని స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ అన్నారు. ఈ పరిణామం తర్వాతైనా విధాన నిర్ణేతలు మేలుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
"నేడు భారత విమానయాన రంగానికి చీకటి రోజు. అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌లైన్స్‌ను స్థాపించి నరేశ్, అనితా గోయల్ ద్వయం దేశం గర్వపడేలా చేశారు"
-అజయ్‌సింగ్, ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్, స్పైస్ జెట్
గోయల్ వైదొలిగిన వేళ నిధుల రాక
ఆర్థిక పరిస్థితి దెబ్బతిని 80 విమానాలను తిప్పడం మానేసింది జెట్ ఎయిర్వేస్. దేశీయ రుణదాతల నుంచి అప్పులను స్వీకరించేందుకు ఎస్బీఐ తయారుచేసిన ప్రణాళికను జెట్ ఎయిర్వేస్ బోర్డు సభ్యులు అంగీకరించారు. దీని ద్వారా 51 శాతం కంపెనీ షేర్లను రూ.1500 కోట్ల రూపాయలకు అమ్మనున్నారు. ఈ ధనాన్ని 11.4 కోట్ల ఈక్విటీ షేర్ల అమ్మకం ద్వారా సమకూరుస్తారు. ప్రస్తుతం రూ. 8000 వేల కోట్ల రుణభారంతో ఉంది జెట్ ఎయిర్వేస్పై.
కొనుగోలుదారు కోసం చూస్తున్నాం
జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసే వారి కోసం చూస్తున్నట్లు కన్సార్టియమ్ ఆఫ్ లెండర్ ఎస్బీఐ ప్రకటించింది.
"మే 31లోపే ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. జూన్ అంటే మరీ ఆలస్యమవుతుంది. ఎవరైనా జెట్ ఎయిర్వేస్లోకి రావచ్చు. ఆసక్తి వ్యక్తపరిచేందుకు ఏప్రిల్ 9 గడువు. బిడ్ దాఖలుకు ఏప్రిల్ 30 ఆఖరు తేదీ. "-రజ్నీశ్ కుమార్, ఎస్బీఐ ఛైర్మన్
తగ్గిన గోయల్ షేర్లు
సంస్థలో 50 శాతంగా ఉన్న తన షేర్లను 25 శాతానికి తగ్గించుకున్నారు గోయల్. 24 శాతం షేర్లు కలిగి ఉన్న భాగస్వామ్య కంపెనీ అబుదబీ ఇతెహాద్ ఎయిర్వేస్ 12 శాతానికి తగ్గించుకుంది.
దూసుకెళ్లిన జెట్ ఎయిర్వేస్ షేర్లు
నరేశ్ గోయల్ దంపతులు జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి బయటకు వస్తున్నారన్న విషయం బయటపడగానే ఆ కంపెనీ షేర్లు రాకెట్లలా దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌లో 12.69 శాతం పెరిగి షేర్ ధర రూ.254.50 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 17.77 శాతం పెరుగుదలతో రూ. 266 వద్ద తచ్చాడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో జెట్ ఎయిర్వేస్ ధర 15.46 శాతం పెరిగి రూ. 261 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన 4 కోట్లషేర్ల లావాదేవీలు జరిగాయి.