కరోనా సంక్షోభానికి తోడు, నిరర్ధక ఆస్తుల పెరుగుదల కారణంగా ఈ ఏడాది ప్రభుత్వ బ్యాంకుల (పీఎస్బీ) ప్రైవేటీకరణ దాదాపు ఉండకపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకు, యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియాలు... ఆర్బీఐ సత్వర దిద్దుబాటు ప్రణాళిక (పీసీఏ) కింద ఉన్నాయి. ఈ నాలుగు పీఎస్బీలపై రుణాలు, నిర్వహణ పరిహారం, డైరెక్టర్ల ఫీజులు సహా పలు అంశాలపై ఆర్బీఐ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల పెద్దగా వ్యాపార ప్రయోజనం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా వీటిని కొనడానికి కూడా ప్రైవేటు బ్యాంకింగ్ వ్యవస్థలో సరైన కక్షిదారులు లేరని వెల్లడించాయి.
కరోనా సంక్షోభం, లాక్డౌన్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల రికవరీ ప్రక్రియపై, ప్రైవేటు రంగ బ్యాంకుల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అందుకే ప్రభుత్వం వ్యూహాత్మక రంగాల్లోని సంస్థల విక్రయంలో ఆచితూచి వ్యవహరిస్తోందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ఏకీకృతం చేసే విధానాన్ని అనుసరిస్తోంది ప్రభుత్వం.
ఇదీ చూడండి: అమెరికా నుంచి 'లుపిన్' ఔషధం వెనక్కి