కరోనా వైరస్ చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది కేంద్రం. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్(ఈఓయూ), ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ కింద కూడా వీటిని ఎగుమతి చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై సెజ్‌లు కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయడానికి వీల్లేదని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ప్రకటనలో తెలిపింది.
మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనాపైనా ప్రభావం చూపుతుందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపిన నేపథ్యంలో మార్చి 25నే వీటి ఎగుమతులపై నిషేధం విధించింది కేంద్రం. అయితే సెజ్‌లు, ఈఓయూలకు మినహాయింపునిచ్చింది. ఇప్పడు వాటిపైనా ఆంక్షలు విధించింది.
ట్రంప్ అడిగినా నో..
అమెరికాలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ కారణంగా ఆ దేశంలో ఇప్పటివరకు 7వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3లక్షల మందికిపైగా వ్యాధి బారినపడ్డారు. దీంతో కరోనాపై ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను తమకు ఎగుమతి చేయాలని భారత ప్రధాని నరేంద్రమోదీని కోరినట్లు చెప్పారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ భారీ స్థాయిలో వీటిని తయారు చేస్తోందన్నారు. తన అభ్యర్థనను సీరియస్ తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.