ఇంధనం, విద్యుత్ ధరల తగ్గుదలతో ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చింది. కరోనా కారణంగా పరిమితంగా కొనుగోళ్లు జరగటం వల్ల ధరల పెరుగుదల అదుపులో ఉందని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది.
కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో ప్రాథమిక వస్తువుల టోకు ద్రవ్యోల్బణం 0.79 శాతంగా నమోదైంది. మార్చిలో ఇది 3.72 శాతంగా ఉంది.
- విద్యుత్, ఇంధనానికి సంబంధించి ద్రవ్యోల్బణం మార్చిలో -1.76 శాతంగా ఉండగా.. ఏప్రిల్లో -10.12 శాతానికి దిగొచ్చింది.
- ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 3.60 శాతానికి తగ్గింది. మార్చిలో ఇది 5.49 శాతంగా ఉంది.
- మార్చి నెలతో పోలిస్తే ఆహార ఉత్పత్తులు 0.29 శాతం, ఔషధాలు, వైద్య రసాయనాలు, వృక్ష ఉత్పత్తులు 0.15 శాతం, ప్రాథమిక లోహాల ధరలు 0.84 శాతం తగ్గాయి.
- రసాయనాలు, రసాయన ఉత్పత్తులు 0.86 శాతం, శీతల పానీయాల ధరలు 0.24 శాతం గత నెలతో పోలిస్తే పెరిగాయి.
తయారీ ఉత్పత్తుల బృందం సూచీ అందుబాటులో లేని కారణంగా అన్ని వస్తువుల టోకు ద్రవ్యోల్బణాన్ని లెక్కించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మండీ ధరల ఆధారంగా ప్రాథమిక వస్తువుల ధరలను లెక్కగట్టినట్లు వెల్లడించింది.