దేశంలో ఈ కామర్స్ సంస్థలు వస్తు, సేవల ఫ్లాష్ సేల్ నిర్వహించడానికి వీల్లేకుండా నిబంధన విధించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రతిపాదించింది. కొన్నేళ్లుగా ఈ కామర్స్ సంస్థలు, కొత్త తరహా వ్యాపార విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టానికి సవరణలను కేంద్ర వినియోగ వ్యవహారాలశాఖ ప్రతిపాదించింది. జులై 6లోపు దీనిపై సూచనలు, సలహాలు తెలిపే వీలుంది. దీని ప్రకారం..
భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలనుకునే ప్రతి ఈ కామర్స్ సంస్థ తప్పనిసరిగా పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య మండలి (డీపీఐఐటీ) దగ్గర నిర్దిష్ట సమయంలోపు పేరు నమోదు చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను వినియోగదారులకు జారీచేసే ఇన్వాయిస్ ఆర్డర్‌పై స్పష్టంగా కనిపించేలా ముద్రించాలి. ప్రతి ఇ కామర్స్ సంస్థ తన లీగల్ పేరు, ప్రధాన కార్యాలయం, శాఖల వివరాలు, వెబ్‌సైట్ పేరు, వివరాలు, సంప్రదించాల్సిన ఇ మెయిల్, కస్టమర్‌కేర్, ఫిర్యాదుల పరిష్కార అధికారి ల్యాండ్‌లైన్, మొబైల్‌ఫోన్ నెంబర్లను తన వెబ్‌సైట్‌లో స్పష్టంగా పొందుపరచాలి.
- వ్యాపార కార్యకలాపాలు-ఇతరత్రా కార్యక్రమాల్లో ఎలాంటి అనుచిత పద్ధతులు పాటించడానికి వీల్లేదు. వినియోగదారులను తప్పుదోవపట్టించే ప్రకటనలు ఇవ్వకూడదు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్యను బట్టి వాటి పరిస్కారం కోసం తగిన పరిమాణంలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి.
- వినియోగదారుల హక్కుల చట్టంలోని నిబంధనలను అమలుచేసేందుకు చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్‌ను నియమించాలి. సదరు వ్యక్తి భారత్‌లోనే నివసిస్తూ ఉండాలి.
- చట్టబద్ద ఏజెన్సీలతో సమన్వయం కోసం 24×7 అందుబాటులో ఉండే వ్యక్తి నెంబర్ అందించాలి.
- వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం సంస్థలో పనిచేస్తూ, దేశంలో నివాసం ఉండే ఉద్యోగిని రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలి. అతని వివరాలను వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో ప్రముఖంగా కనిపించేలా ప్రచురించాలి. వారి పేరు, ఫోన్ నెంబర్, ఫిర్యాదు చేయాల్సిన విధానం గురించి అందులో ఇవ్వాలి.
- ఈ కామర్స్ సంస్థలు విదేశీ వస్తువులను విక్రయిస్తే ఆ వస్తువులను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు? ఎవరి నుంచి కొనుగోలుచేశారు? ఈ వేదికపై ఎవరు విక్రయిస్తున్నారన్న వివరాలను పొందుపరచాలి.
- ఏ సంస్థా ఫ్లాష్ సేల్స్ నిర్వహించడానికి వీల్లేదు.
- మార్కెట్‌లో బలంగా ఉన్న ఇ మార్కెట్ సంస్థలు తన స్థాయిని దుర్వినియోగం చేయడానికి కుదరదు.
- ఏ సంస్థా తనకు తానుగా వినియోగదారుడిగా చెప్పుకుని వస్తు, సేవల నాణ్యత గురించి తప్పుదోవ పట్టించే రివ్యూలు పోస్ట్ చేయకూడదు.
- రిటర్న్, రిఫండ్, ఎక్స్ఛేంజ్, ఏ తేదీలోపు ఉపయోగించాలి, వారెంటీ, గ్యారెంటీ, డెలివరీ, షిప్‌మెంట్, రిటర్న్ షిప్‌మెంట్ ఖర్చుల గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.
ఇదీ చూడండి: Made in India: స్వదేశీ 5జీ కోసం ఎయిర్టెల్, టాటా డీల్