Tax on Capital Gains : షేర్లు, బాండ్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడుల ద్వారా ఆర్జించిన లాభాలపై పన్నును లెక్కగట్టేందుకు అమలవుతున్న కాలపరిమితులు, శ్లాబుల విషయంలో ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. మూలధన లాభాలపై పన్ను విధానాన్ని సులభతరం చేయాలని భావిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన లాభాల పన్ను వసూళ్లు 10 రెట్లు పెరిగి రూ.60000- రూ.80,000 కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. కిందటి ఆర్థిక సంవత్సరం ఇది రూ.6,000- 8,000 కోట్లుగా నమోదయ్యాయని తెలిపారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. స్థిర లేదా చరాస్తుల్లో పెట్టిన పెట్టుబడులపై లాభాలు ఆర్జించినప్పుడు.. ఆ లాభాలకు పన్ను వర్తిస్తుంది. అయితే కార్లు, వస్తాలు, ఫర్నిచర్ లాంటి చరాస్తులకు ఈ పన్ను వర్తించదు.
Capital Gain Tax
'ప్రస్తుతం మూలధన లాభాల పన్ను విధానం మరీ క్లిష్టంగా ఉంది. ముఖ్యంగా పన్ను రేట్లు, ఆస్తులను అట్టేపెట్టుకునే కాలపరిమితుల విషయంలో పునఃపరిశీలన అవసరం. అవకాశం దొరికితే దీనిపై కొంత కసరత్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ'ని సీఐఐ (పరిశ్రమ సంఘాల సమాఖ్య) నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ బజాజ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మూలధన లాభాలపై పన్ను రేట్లను ఏ తరహాలో అమలు చేస్తున్నారనే విషయాన్ని అధ్యయనం చేయాల్సిందిగా సీఐఐకు ఆయన సూచించారు. 'మొదటిది పన్ను రేటు. రెండోది కాలపరిమితి. ఇవి మరి గందరగోళంగా మారాయి. స్థిరాస్తికి 24 నెలలు, షేర్లకు 12 నెలలు, బాండ్లకు 36 నెలలుగా కాలపరిమితి ఉంది. మేం దీనిపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉంద’ని తరుణ్ బజాజ్ అన్నారు. దీర్ఘ, స్వల్ప కాలపరిమితులకు మూలధన లాభాల పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ (10శాతం; 15శాతం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 'అమెరికాలో ఉద్దీపనల ఉపసంహరణ జరిగితే, మన దేశం నుంచి పెట్టుబడులు కొంత వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయి. అప్పుడు మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమ'ని బజాజ్ అన్నారు.
రెస్టారెంట్ల డిమాండుపైనా చర్చిస్తాం
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు వీలున్న జీఎస్‌టీ అధిక శ్లాబ్ పరిధిలోకి తిరిగి వెళ్తామంటూ రెస్టారెంటు పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతిపాదనపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తరుణ్ బజాజ్ తెలిపారు. ఏసీ కావచ్చు, నాన్ ఏసీ కావచ్చు రెస్టారెంట్ సేవలకు ప్రస్తుతం 5 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. అయితే ఐటీసీని (ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్) క్లెయిమ్ చేసుకునే వీల్లేదు. స్టార్ హోటళ్లలో రోజుకు గదికి రూ.7,500 లేదా ఆ పైన అద్దె తీసుకుంటే 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది. ఈ కట్టిన జీఎస్‌టీని ఐటీసీ కింద క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. రూ.7,500 లోపు అద్దె ఉన్న హోటళ్లు 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుండగా.. ఐటీసీ క్లెయిమ్‌కు అనుమతి లేదు. 'జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన కొత్తలో నాన్ ఏసీ రెస్టారెంట్లలో 12 శాతం, ఏసీ రెస్టారెంట్లలో 18 శాతం జీఎస్‌టీ అమలయ్యేది. వాటిపై ఐటీసీ ఉండేది కూడా. ఇప్పుడు ఐటీసీ లేని ఐదు శాతం పన్ను రేటు కంటే కూడా ఐటీసీతో కూడిన అధిక శ్లాబ్ పరిధిలోకి తిరిగి వెళ్తామనే ప్రతిపాదనను రెస్టారెంటు పరిశ్రమ మా దృష్టికి తీసుకొచ్చింది. ఈ అంశంపై పరిశీలించేందుకు సిద్ధమేన'నని ఆయన అన్నారు. దీనిపై తుది నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని జీఎస్‌టీ మండలి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఎన్నికల తర్వాత ధరల మోతే- వంట నూనెలు, పెట్రోల్ పైపైకి!