రెండు ప్రభుత్వ బ్యాంకులతో పాటు, ఓ ప్రభుత్వ రంగ బీమా సంస్థను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల పేర్లు వెలుగులోకి రాగా.. తాజాగా ఓ బీమా సంస్థ ప్రైవేటీకరణకు సంబంధించి ఓ రెండు బీమా కంపెనీల పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రైవేటీకరణకు వీటి పేర్లను కేంద్రం పరిశీలించొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మూలధన సాయంతో వాటి ఆర్థికస్థితి మెరుగుపడిన నేపథ్యంలో ఈ కంపెనీలను ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని తెలిపాయి. అలాగే, వాటి ఆర్థికస్థితిని మరింత మెరుగుపర్చేందుకు ఈ త్రైమాసికంలోనే మరో రూ.3వేల కోట్ల మేర మూలధన సాయం అందించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో ఓరియంటల్, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీల కొనుగోలుకు ప్రైవేట్ వ్యక్తులు సైతం ఆసక్తికనబరిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 'ప్రైవేటు' వ్యక్తుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని, అందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపాయి. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ సైతం ఈ జాబితాలో ఉండే అవకాశం లేకపోలేదని తెలిపాయి. ప్రైవేటీకరణకు సంబంధించి నీతి ఆయోగ్ సిఫార్సులు చేయనుంది. ఆర్థికశాఖ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ ఆస్సెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) దీనిపై తుదినిర్ణయం తీసుకోనుంది.