ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కమిటీ నివేదికను కేబినెట్ పరిశీలించిన తర్వాత.. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి బిల్లును తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈటీవీ భారత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. బడ్జెట్ సహా కీలక విషయాలపై మాట్లాడారు.
బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని ఠాకూర్ వివరించారు. వీటిని విక్రయించడం వల్ల వచ్చే డబ్బును అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగించుకోవచ్చని చెప్పారు. బ్యాంకుల విలీనం వల్ల పెట్టుబడి పరిణామం పెరిగి ఎక్కువ మందికి సేవలందించేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు. ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపారు. బ్యాంకుల బలోపేతానికి ఎన్నో చర్యలు తీసుకున్నామని చెప్పిన ఆయన.. ప్రభుత్వ రంగంలో ఇన్ని బ్యాంకులు ఉండాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు.
కరోనా టీకా విషయంలో అన్ని రాష్ట్రాలను సమానభావంతో పరిగణించామని పేర్కొన్నారు ఠాకూర్. అధికారంలో ఉన్న పార్టీని బట్టి డోసులు ఇవ్వలేదని చెప్పారు. కరోనా నివారణకు పగడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. లాక్డౌన్ విధించి అనేక ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు.
ఇంధన ధరల పెరుగుదలపై స్పందించిన ఆయన.. కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై పన్నులు విధిస్తున్నాయని చెప్పారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గించాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనా ఉందని అన్నారు.
ఇదీ చదవండి: ఎన్‌బీఎఫ్‌సీలపై కరోనా కాటు- పెరగనున్న ఎన్పీఏలు!