లేహ్ ప్రాంతాన్ని లద్దాఖ్‌లో కాకుండా.. జమ్ముకశ్మీర్ భూభాగంలో చూపించటంపై తీవ్రంగా పరిగణించింది కేంద్రం. ఈ అంశంపై ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న నోటీసులు పంపినట్టు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ వర్గాలు తెలిపాయి. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ సహా.. ఆ సంస్థ ప్రతినిధులపై చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని పేర్కొంటూ ట్విట్టర్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌కు నోటీసులు జారీ చేసింది. 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
దేశ మ్యాప్‌ను తప్పుగా చూపించి.. దేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరవపరిచినందుకు చర్యలెందుకు తీసుకోకూడదో చెప్పాలని పేర్కొంది. దేశ సార్వభౌమత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు జరిగిన ఉద్దేశ పూర్వక ప్రయత్నమని తన నోటీసుల్లో స్పష్టం చేసింది కేంద్రం.
అంతకముందు కూడా..
భారత భూ భాగమైన లేహ్ ప్రాంతాన్ని కొద్ది రోజుల క్రితం చైనాలో చూపించింది ట్విట్టర్. ఈ అంశంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అనంతరం దీనికి ప్రతిస్పందనగా.. చైనా స్థానంలో జమ్ముకశ్మీర్‌ను ఉంచింది. అయితే.. తప్పుగా చూపించిన ఈ మ్యాప్‌ను ట్విట్టర్ ఇప్పటివరకూ సరిచేయలేదు. ఇది భారత సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకిస్తుందని అధికావర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: 'మధ్యతరగతి'కి కేంద్రం 'ఆత్మనిర్భర్' కానుక