దేశీయ విమాన ప్రయాణాలు మరింత ప్రియం కానున్నాయి. విమాన టెకెట్ ధరలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను 9.83 శాతం నుంచి 12.82 శాతానికి పెంచుతూ విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవడం ఇందుకు కారణం.
కరోనా మొదటి దశలో విధించిన లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత 2020 మే 25న విమాన సర్వీసులు తిరిగి ప్రారభమయ్యాయి. ఈ సమయంలో విమాన టికెట్ ధరల కనిష్ఠ, గరిష్ఠ మొత్తాలపై పరిమితులు విధించింది కేంద్రం.
ధరలపై కనిష్ఠ పరిమితులు కరోనా సహా ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్న విమాన సంస్థలను ఆదుకునేందుకు ఉపయోగపడతాయని కేంద్రం తెలిపింది. అదే సమయంలో ప్రయాణికులపై అధిక భారం పడకుండా గరిష్ఠ పరిమితులు చూస్తాయని పేర్కొంది.
కొత్త ధరలు ఇలా..
- తాజాగా 40 నిమిషాల లోపు ప్రయాణ సమయం ఉన్న విమాన టికెట్ ధర కనిష్ఠ పరిమితిని రూ.2,600 నుంచి రూ.2,900కు పెంచింది కేంద్రం. ఇదే ప్రయాణ సమయానికి టికెట్ ధర గరిష్ఠ పరిమితిని రూ.8,600కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
- 40-60 నిమిషాల ప్రయాణ దూరం ఉన్న విమాన టికెట్ ధర కనిష్ఠ పరిమితి రూ.3,300 నుంచి రూ.3,700కు పెరిగింది. గరిష్ఠ పరిమితి రూ.11 వేలకు చేరింది.
- 90-120, 120-150, 150-180, 180-210 నిమిషాల ప్రయాణ దూరానికి విమాన టికెట్ ధర కనిష్ఠ పరిమితులు వరుసగా.. రూ.5,300, రూ.6,700, రూ.8,300, రూ.9,800లకు పెరిగాయి. ఇంతకు ముందు ఈ ధరలు వరుసగా రూ.4,700, రూ.6,100, రూ.7,400, రూ.8,700గా ఉండేవి.
ఇదీ చదవండి: 'సంపద సృష్టికి తుక్కు పాలసీ దోహదం'