ఎయిర్ ఇండియా (Air India News) విక్రయం వ్యవహారంలో వస్తున్న వార్తలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ప్రస్తుతం దుబాయి పర్యటనలో ఉన్న ఆయన ఎయిర్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. ఎయిర్ ఇండియా కొత్త యజమాని ఎవరనే అంశంపై జరగాల్సిన ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసి తుది ఎంపిక జరుగుతుందన్నారు. టాటాసన్స్ (Tata Sons) చేతికి ఎయిర్ ఇండియా అప్పగించినట్టు నిన్న మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన్ను విలేకర్లు ప్రశ్నించగా.. ప్రస్తుతం తాను దుబాయిలో ఉన్నాననీ.. అలాంటి నిర్ణయం జరిగిందని తాను అనుకోవడంలేదన్నారు. ఎయిర్ ఇండియా విక్రయానికి సంబంధించి బిడ్‌లు ఆహ్వానించినప్పటికీ.. వాటన్నింటినీ అధికారులు పూర్తిగా అంచనా వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది విజేతను ఎంపిక చేస్తుందన్నారు.
రుణాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా కొనుగోలుకు సంబంధించి టాటా సన్స్ (Tata Sons) అధిక మొత్తానికి బిడ్ వేయడంతో ఆ సంస్థను కొత్త యజమానికిగా నిర్ణయించినట్టు నిన్న పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై అటు ఎయిర్ ఇండియా గానీ, టాటా గ్రూపు గానీ స్పందించనప్పటికీ దీపమ్ కార్యదర్శి ట్వీట్ చేశారు. 'ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు తప్పకుండా వెల్లడిస్తుంద'ని కేంద్ర పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ (దీపమ్) విభాగం కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఇప్పటికే స్పష్టంచేశారు.
ఇదీ చూడండి: Chip Shortage: వాహన విక్రయాలకు చిప్‌సెట్ చెక్