ఆసుపత్రులకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం, పేలుడు పదార్థాల రక్షిత సంస్థ(పెసో) చర్యలు చేపట్టింది. దేశంలో కొవిడ్-19 విస్తరణ నేపథ్యంలో.. ఆసుపత్రులకు, పెట్రోలియం, పేలుడు పదార్థాల తయారీ సంస్థలకు, అగ్నిమాపక, గ్యాస్ పరిశ్రమలకు అంతరాయం లేకుండా ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రాణవాయువును అత్యవసరంగా నిల్వ, రవాణా చేయడానికి లైసెన్స్‌లు మంజూరు చేసేలా పెసో ప్రధాన కార్యాలయం.. అన్ని కార్యాలయాలకు సూచనలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రాష్ట్రాలకూ సూచన..
ఆక్సిజన్, నైట్రస్ ఆక్సైడ్ వాయువుల రవాణా, తయారీకి ఎలాంటి అంతరాయం కలిగించకుండా అనుమతి ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మార్చి 25న సూచించింది పెసో. లైసెన్సుల గడువు తేదిని 2020 మార్చి 31 నుంచి 2020 సెప్టెంబరు 30 వరకు పెంచింది.
లైసెన్సుల రెన్యువల్ ఆలస్యమైనా రుసుము కూడా వసూలు చేయడం లేదని తెలిపారు అధికారులు. ఆక్సిజన్, సీఎన్జీ, ఎల్పీజీ, ఇతర వాయువుల నిల్వ కోసం వినియోగించే సిలిండర్లకు చట్టబద్ధమైన హైడ్రో పరీక్ష గడువు మార్చి 31తో ముగిస్తున్నప్పటికి వాటిని జూన్ 30న పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: మొబైల్ వారంటీ ముగుస్తుందా? అయినా ఫర్వాలేదు!