ఇ-కామర్స్ సంస్థలకు కొత్త నిబంధనలను 'కన్జూమర్ ప్రొటెక్షన్ (ఇ-కామర్స్) రూల్స్, 2020' పేరిట ప్రభుత్వం నోటిఫై చేసింది. ఉత్పత్తిపై తయారైన దేశం వివరాలను తప్పనిసరిగా ఉంచడం వంటి నిబంధనలు ఇందులో ఉన్నాయి. కొత్త నిబంధనలను అమలు చేయకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
భారత్ లేదా విదేశాల్లో నమోదై మన వినియోగదారులకు వస్తువులు, సేవలు అందిస్తున్న అన్ని ఎలక్ట్రానిక్ రిటైలర్లకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనలను అతిక్రమిస్తే 2019 వినియోగదారుల భద్రత చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇక వస్తువులు, సేవల మొత్తం ధరను ఇతర ఛార్జీలతో సహా ఇ-కామర్స్ సంస్థలు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఉత్పత్తి గడువు తేదీ, ఏ దేశంలో తయారైంది వంటి వివరాలను కొనుగోలు కంటే ముందు దశలోనే వినియోగదారుకు తెలియజేయాలి. వస్తువుల రిటర్న్, రిఫండ్, ఎక్స్ఛేంజీ, వారెంటీ, గ్యారెంటీ, డెలివరీ, షిప్‌మెంట్, ఇతర సమాచారాన్ని సైతం విధిగా ఇవ్వాలి. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పైవివరాలను కొనుగోలుదార్లకు విక్రేతలు తెలపాలి. కొత్త నిబంధనల ప్రకారం.. ఇ-కామర్స్ సంస్థలు క్యాన్సిలేషన్ ఛార్జీలను విధించరాదు.