కరెంటు ఖాతా లోటుపై నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 22.58 శాతం పెరిగి.. 34.6 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.2.54 లక్షల కోట్లు)కు చేరాయి. దేశీయంగా గిరాకీ పుంజుకోవడమే దిగుమతులకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. అదే సమయంలో వెండి దిగుమతులు 71 శాతం తగ్గి.. 791 మిలియన్ డాలర్లుగా నమోదైంది.
పసిడి దిగుమతులు పెరిగినప్పటికీ.. 2019-20లో 161.3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2020-21లో 98.56 బిలియన్ డాలర్లకు తగ్గడం గమనార్హం. రానున్న అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దిగుమతులు మరింత పెరిగి కరెంటు ఖాతా లోటుపై ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమలే ఎక్కువగా పసిడిని దిగుమతి చేసుకుంటాయి. ఇక గత ఆర్థిక ఏడాది జెమ్స్ అండ్ జెవెల్లరీ ఎగుమతులు 27.5 శాతం తగ్గి.. 26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ ఏటా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. బంగారం దిగుమతులపై ఉన్న సుంకాన్ని గత బడ్జెట్‌లో కేంద్రం 12.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.
ఇదీ చదవండి: భారీగా తగ్గిన ప్రయాణికుల వాహన ఎగుమతులు