ఏప్రిల్- జూన్ త్రైమాసికం(క్యూ2)లోనూ బంగారం డిమాండ్ భారీగా పడిపోయింది. క్యూ2లో బంగారం డిమాండ్ 11 శాతం తగ్గి... 1,015.7 టన్నులకు పరిమితమైంది. కరోనా వ్యాప్తి సహా, లాక్డౌన్ వంటి పరిస్థితులు ఈ పరిణామాలకు కారణమైనట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) తన నివేదికలో తెలిపింది.
పెట్టుబడులకు స్వర్గధామం
ఇదే సమయంలో పుత్తడిపై పెట్టుబడులు మాత్రం అమాంతం ఎగబాకాయి. గతేడాది ఇదే సమయంలో 295 టన్నుల బంగారంపై పెట్టుబడులు పెట్టగా.. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ సంఖ్య 98 శాతం పెరిగి 582.9 టన్నులకు పెరిగింది.
300 శాతం పెరుగుదల
ఇందులోనూ బంగారం బిస్కెట్లు, నాణేలపై పెట్టుబడులు 32 శాతం మేర పడిపోయాయి. 2019 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వీటిపై పెట్టుబడులు 2018.9 టన్నులు ఉండగా.. ప్రస్తుతం 148.8 టన్నులకు చేరింది. అయితే గోల్డ్ ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)లపై పెట్టుబడులు మాత్రం ఏకంగా 300 శాతం వృద్ధి చెందాయి. గతేడాది ఈ సమయంలో 76.1 టన్నులుగా ఉన్న ఈటీఎఫ్ పెట్టుబడులు.. ఈ సంవత్సరం క్యూ2లో 434.1 టన్నులకు చేరింది.
ఆభరణాలు నేల చూపులు
ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల డిమాండ్ సైతం రికార్డు స్థాయిలో పతనమైంది. గతేడాది క్యూ2తో పోలిస్తే 53 శాతం తగ్గిపోయింది. 2019లో 529.6 టన్నులుగా ఉన్న ఆభరణాల డిమాండ్.. ప్రస్తుతం 251.5 టన్నులకు పడిపోయింది.
"భారత్, చైనా దేశాల్లో లాక్డౌన్ కారణంగా రెండో త్రైమాసికంలో బంగారం డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే బంగారం డిమాండ్‌పై ప్రభావాన్ని అంచనా వేయవచ్చు."
-సోమసుందరం, డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ
కేంద్రీయ బ్యాంకుల నికర కొనుగోళ్లు సైతం 50 శాతం మేర తగ్గాయి. గతేడాది క్యూ2లో 231.7 టన్నులుగా ఉన్న డిమాండ్.. ప్రస్తుతం 114.7 టన్నులకు పడిపోయింది. క్యూ2లో బంగారం సరఫరా సైతం 15 శాతం తగ్గి 1,034.4 టన్నులకు పడిపోయింది.
ఇదీ చదవండి: అమెరికా కాంగ్రెస్ ముందు టెక్ దిగ్గజాల వాంగ్మూలం