కొత్త కారు బుక్ చేశారా.. రెండు నెలలైనా ఇంకా రాలేదా.. అడిగితే ఇంకా టైమ్ పడుతుందని డీలర్ చెబుతున్నారా.. మీరే కాదు, ఎంతో మంది కారు బుక్ చేసి డెలివరీ కోసం ఎదురుచూస్తున్నారు. గిరాకీకి తగ్గట్లు కంపెనీలు సరఫరా చేయలేకపోవటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఇదే పరిస్థితి. ఆదరణ అధికంగా ఉన్న మోడళ్ల కోసం అయితే మరింత కాలం వేచిచూడాల్సిందే.
తయారై ఉన్న కార్ల నిల్వలు తగ్గించుకోడానికి గత ఏడాది నవంబరు, డిసెంబరులో ఉత్పత్తిని కంపెనీలు తగ్గించడం, కీలక ఎలక్ట్రానిక్ విడిభాగాలు లభించకపోవడం ఇందుకు కారణాలు. అందుకే కార్లను కొన్ని కంపెనీలు వినియోగదార్లకు అందించలేకపోతున్నాయి. కార్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ చిప్‌లు తైవాన్, కొరియా, చైనా, జర్మనీ, డెన్మార్క్ దేశాల నుంచి ఇక్కడి వాహన కంపెనీలు కొనుగోలు చేస్తుంటాయి. ప్రస్తుతం ఆయా దేశాల నుంచి చిప్‌లు తగినంతగా రావడం లేదు. కార్లలో వినోదం, నావిగేషన్, ఏసీ, ఇంజన్, ప్రమాదాల నుంచి రక్షించే బెలూన్.. తదితర అన్ని వ్యవస్థలను చిప్‌తో అనుసంధానిస్తున్నారు. ఫలితంగా చిప్‌ల వినియోగం అధికమైంది. అవి లభించక కార్ల తయారీ ఆగుతోంది. కొవిడ్-19 పరిణామాల వల్ల ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా బాగా పెరిగింది. ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లు, ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వాటికి ఎలక్ట్రానిక్ చిప్‌ల సరఫరా పెరిగి, వాహన కంపెనీల అవసరాలకు సరిపడా అందించలేకపోతున్నారని చెబుతున్నారు.
కొన్ని మోడళ్లకు అధిక గిరాకీ
- కొత్త మోడళ్లకు వినియోగదార్ల నుంచి ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో, ఆయా కంపెనీలు ఆ మేర సరఫరా చేయలేకపోతున్నాయి.
- కొవిడ్-19 లాక్‌డౌన్ పరిణామాల వల్ల సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. వాటిని తిరిగి గాడిలో పెట్టడానికి సమయం తీసుకుందని, అందుకే ప్రస్తుత పరిస్థితి ఉత్పన్నం అయినట్లు చెబుతున్నారు.
- మారుతీలో ఎర్టిగా, బ్రెజా, స్విఫ్ట్ మోడల్ కార్ల కోసం నెలా, నెలన్నర వేచి చూడాల్సి వస్తోంది.హ్యూందాయ్ క్రెటాకు నాలుగు నెలలు, వెన్యూ, ఐ10 కోసం నెల రోజుల వరకు వెయిటింగ్ ఉంటోంది. ఎంజీ హెక్టార్‌కు మూడు నెలలు, కియా సెల్టోస్‌కు 3-4 నెలలు ఎదురుచూడక తప్పడం లేదు.
- ప్రారంభస్థాయి మోడళ్లను వెంటనే డెలివరీ ఇస్తున్నామని, వాటికి కొరత లేదని హైదరాబాద్‌లోని మారుతీ సుజుకీ డీలర్ సాబూ మోటార్స్ మార్కెటింగ్ హెడ్ కిరణ్ వివరించారు. కానీ వ్యాగన్ ఆర్, ఎర్టిగా వంటి మోడళ్లు వెంటనే ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు.
టయోటాకు సమస్య లేదు!
ప్రపంచంలోనే నెంబర్-1 కార్ల కంపెనీ అయిన టయోటాకు చిప్‌ల సమస్య లేదు. 4-6 నెలల అవసరాలకు తగ్గట్లుగా ఈ సంస్థ విడిభాగాలను సిద్ధంగా పెట్టుకోవడం దీనికి ప్రధాన కారణం. అందువల్ల టయోటా కార్లను పెద్దగా జాప్యం లేకుండా వినియోగదార్లకు అందించగలుగుతున్నారు. విడిభాగాలను కనీస స్థాయిలో నిల్వ చేస్తూ, వ్యయాలు తగ్గించుకునే విధానానికి నాలుగు దశాబ్దాల క్రితమే ఈ జపాన్ కంపెనీ శ్రీకారం చుట్టింది. అదే ఇప్పుడు ఆ కంపెనీకి కలిసొచ్చింది. అందుకే టయోటా చిప్‌ల కొరత సమస్యను అధిగమించగలుగుతోంది. టయోటా యాజమాన్యం విడిభాగాల సరఫరాను ప్రతి దశలో పర్యవేక్షిస్తోందని, ఎక్కడైనా జాప్యం జరుగుతోందని తెలిస్తే.. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. కొవిడ్-19 మహమ్మారి వల్ల విడిభాగాలకు ఇబ్బంది ఎదురవుతుందని ముందే ఊహించి కంపెనీ తీసుకున్న జాగ్రత్తలే ఇప్పుడు ఉపకరించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: అత్యంత ఆనందకర దేశం ఫిన్లాండ్.. భారత్@139