ఏప్రిల్ 1.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే తేదీ. కంపెనీలకు, ఉద్యోగులకు.. అంతెందుకు ప్రభుత్వాలకూ ఇది 'పద్దు'పొడుపు తేదీ. ఈ తేదీ నుంచే చాలా మార్పులు.. చేర్పులు చోటు చేసుకుంటుంటాయి. బడ్జెట్‌లో ప్రకటించే అనేక ప్రతిపాదనలు అమల్లోకి వచ్చేది ఈ తారీఖు నుంచే. ఈసారి కార్లు, బైక్‌లు, టీవీలు, ఏసీల ధరల రూపంలో సామాన్యులపై ఒకటో తారీఖు నుంచి భారం పడే అవకాశం ఉంది. అలాగే విమాన ప్రయాణంపైనా కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావొచ్చు. ఇలాంటివి చాలానే ఉన్నాయ్.. అవేంటంటే..
ఈ బ్యాంకుల చెక్కు బుక్‌లు పనిచేయవు

ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్.. ఈ ఏడు బ్యాంకుల్లో ఖాతాలున్నాయా.. ఈ బ్యాంకులకు చెందిన పాస్ పుస్తకాలు, చెక్కు బుక్కులు ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు. ఎందుకంటే.. ఈ ఏడు బ్యాంకులు వేర్వేరు బ్యాంకుల్లో విలీనమయ్యాయి. విలీనమైన బ్యాంకులకు చెందిన చెక్ పుస్తకాలను ఖాతాదారులు తీసుకోవాల్సి ఉంటుంది. దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో; ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)లో; కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్‌లో; ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్ విలీనం అయిన సంగతి తెలిసిందే.
బ్యాంకు డిపాజిట్లపై రెట్టింపు టీడీఎస్

ఆదాయ పన్ను రిటర్ను(ఐటీఆర్)లు దాఖలు చేయకపోతే బ్యాంకు డిపాజిట్లపై మూలం వద్ద పన్ను మినహాయింపు(టీడీఎస్) రెట్టింపు ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుంది. అంటే ఆదాయ పన్ను శ్లాబులో లేనివారు కూడా ఐటీఆర్ దాఖలు చేయకపోతే రెట్టింపు టీడీఎస్‌ను కట్టాల్సి వస్తుంది. ఐటీ రిటర్నుల దాఖలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. గత రెండేళ్లలో రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ టీడీఎస్, టీసీఎస్ ఉన్నవారికి నిర్దిష్ట రేటు కంటే రెట్టింపు లేదా 5 శాతం (ఏది ఎక్కువైతే అది పద్ధతిలో)ను వసూలు చేస్తారు.
ఈపీఎఫ్ ఖాతాలో ఎక్కువ జమ చేస్తున్నారా?

ఏప్రిల్ 1, 2021 నుంచి ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) ఖాతాలో పెట్టే పెట్టుబడులు ఆదాయ పన్ను నుంచి తప్పించుకోలేవు. ఎలాగంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే(బడ్జెట్‌లో ప్రకటించిన దాని ప్రకారం) ఎక్కువ ఈపీఎఫ్‌లో పెట్టుబడులు పెడితే.. దానిపై వచ్చే వడ్డీకి పన్ను విధిస్తారు. కాగా, తాజాగా ఈ పన్ను మినహాయింపు పెట్టుబడులను రూ.5 లక్షలకు పెంచారు. అయితే ఈ పీఎఫ్ జమల్లో కంపెనీ వాటా ఉండకూడదు. ప్రైవేటు ఉద్యోగులు వడ్డీపై పన్ను పడకూడదనుకుంటే ఈపీఎఫ్, వీపీఎఫ్ కలిపి గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకే జమ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సంస్థ (ప్రభుత్వం) నుంచి ఎటువంటి వాటా ఉండదు కాబట్టి రూ.5 లక్షల వరకు వీళ్లు జమ చేసుకున్నా.. వడ్డీపై పన్ను పడదు.
కంపెనీలు క్రిప్టోకరెన్సీ లెక్క చెప్పాల్సిందే

కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి తమ వద్ద ఉండే క్రిప్టోకరెన్సీ వివరాలను తప్పనిసరిగా ఆర్థిక ఖాతాల్లో వెల్లడించాల్సి ఉంటుంది. కంపెనీకి చెందిన ఆర్థిక అంశాలు వాటాదార్లకు తెలియాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఆర్థిక ఫలితాలను ప్రకటించే తేదీ నాటికి ఎంత మేర క్రిప్టోకరెన్సీ ఉందన్నదో చెప్పాలి. అంతే కాదు.. వాటిపై వచ్చిన లాభం, నష్టాలనూ వెల్లడించాలి. ఈ కరెన్సీల్లో ట్రేడింగ్/పెట్టుబడులకు ఇతరుల నుంచి తీసుకునే డిపాజిట్లు, అడ్వాన్సులనూ ఆయా కంపెనీలు చెప్పాల్సి ఉంటుంది.
కార్లు, బైక్‌లు, ఏసీలు ధరలు ప్రియం

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కార్లు, బైక్‌ల ధరలు ప్రియం కానున్నాయి. జనవరిలోనూ కంపెనీలు రేట్లు పెంచాయి. అంతర్జాతీయ సరఫరా కొరత కారణంగా కమొడిటీ, లోహ ధరలు పెరగడంతో కార్లు, బైక్‌ల సంస్థలు రేట్లు పెంచక తప్పడం లేదని చెబుతున్నాయి. టీవీలు, ఏసీలు సైతం రూ.3,000-4,000 వరకు పెరగనున్నాయి. తయారీ వ్యయాలు పెరగడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు ఆ మేరకు ప్రియం కానున్నాయి. ఏసీ ధరలు రూ.1500-2000 వరకు పెరగవచ్చు.
విమానం ఎక్కుతున్నారా?

ఏప్రిల్ నుంచి విమాన ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే భారత విమానాశ్రయాల్లో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఏఎస్‌ఎఫ్) పెరగనుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులపై ఏఎస్‌ఎఫ్‌ను పెంచాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి జారీ అయ్యే టికెట్లపై ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. దేశీయ ప్రయాణికులపై రూ.200 చొప్పున; అంతర్జాతీయ ప్రయాణికులపై 12 డాలర్ల చొప్పున ఈ రేటును విధించనున్నారు. అయితే రెండేళ్లలోపు చిన్నారులకు; డిప్లొమాటిక్ పాస్‌పార్టులున్నవారు.. తదితర ప్రత్యేక వర్గాలకు ఈ ఫీజు వర్తించదు.
ఇదీ చదవండి: లిబ్స్ ఫార్మాసూటికాన్తో బయోకాన్ ఒప్పందం