ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే భవిష్యత్తు విధానాలు కరోనా మహమ్మారి తలపెట్టే నష్టంపైనే ఆధారపడి ఉంటుందని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 2020-21లో ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ఆర్బీఐ అంచనా వేసిన తర్వాత నిర్మల ఈ ప్రకటన చేశారు.
కరోనా సంక్షోభాన్ని తగ్గించేందుకు కేంద్రం తాజాగా రూ.20.97 లక్షల కోట్లను ప్రకటించింది. ఇలాంటి విపత్కర సమయంలో ఆర్థిక వృద్ధి రేటును.. వాస్తవిక మదింపు చేయడం కష్టంతో కూడుకున్న పని అని నిర్మల అన్నారు.
"అన్ని దారులు మూసేయట్లేదు. పరిశ్రమలు నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని కోరుకుంటున్నా. మేం ప్రకటించిన మేరకు అన్ని అమలు చేయండి. దేశంలో కరోనా విస్తృతిని అంచనా వేస్తూ పని చక్కబెట్టుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెరిగేలా చర్యలు తీసుకున్నాం. ఈ నిర్ణయంతో ప్రజల చేతుల్లో డబ్బు చేరుతుంది. అప్పుడే డిమాండ్ పెరిగి మళ్లీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది."
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి.
ఈ కష్టకాలం నుంచి బయటపడేందుకే ప్యాకేజీని ప్రకటించామని.. ఆర్థికంగా సడలింపులు ఇచ్చామని నిర్మల అన్నారు. ఏదైమైనా కరోనా వ్యాప్తి పైనే వీటి అమలు ఆధారపడి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
అడ్డంకులు వద్దు..!
టర్మ్ రుణాలపై మారటోరియాన్ని మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు శుక్రవారం ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఈ 3 నెలలపాటు గడువు కోరిన అందరికీ.. సీబీఐ, కాగ్, విజిలెన్స్ విభాగాల నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల సూచించారు.
ప్రభుత్వ రంగ బ్యాంకు సీఈఓలో భేటీ అయిన నిర్మల.. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించారు.