గత ఆర్థిక సంవత్సరం వెల్లువలా వచ్చిన చేరిన విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు.. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి క్రమంగా వెనక్కి మళ్లుతున్నాయి. రెండో దశ కరోనా ఉద్ధృతి, అమెరికాలో బాండ్ల రాబడుల రాణింపు నేపథ్యంలోనే ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు 1.09 బిలియన్ డాలర్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. ఈ పర్వం ఇలాగే కొనసాగితే 2020 మార్చి తర్వాత అత్యధికంగా ఎఫ్‌పీఐలు తరలివెళ్లిన నెలగా ఈ ఏప్రిల్ నిలవనుంది.
మహమ్మారి మార్చిన పరిస్థితులు..
మార్చి 2020 తర్వాత కేవలం రెండు నెలల్లో మాత్రమే ఎఫ్‌పీఐలు వెనక్కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఏప్రిల్ 2020లో 535 మిలియన్ డాలర్లు.. సెప్టెంబర్ 2020లో 767 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. మిగిలిన నెలల్లో ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లపై భరోసా ఉంచి భారీగా మదుపు చేశారు. అయితే, ఫిబ్రవరి ద్వితీయార్థం నుంచి అమెరికా బాండ్ల ప్రతిఫలాలు పెరగడం, డాలర్ బలపడడం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం దెబ్బతింది. కానీ, ఇటీవలి వారాల్లో పరిస్థితులు కాస్త మెరుగుపడడం వల్ల ఆయా మార్కెట్లపై ఒత్తిడి తగ్గింది. కానీ, భారత్‌లో మాత్రం కరోనా మహమ్మారి పరిస్థితి పూర్తిగా మార్చివేసింది.
రూపాయి మరింత పతనం..
గత ఆరు సెషన్లలో ఎఫ్‌పీఐలే నికర అమ్మకందారులుగా నిలవడం గమనార్హం. ఇటీవల కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మార్కెట్ సూచీలు దిద్దుబాటుకు గురవుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ ఇప్పటి వరకు దాదాపు 8.1 శాతం కుంగింది. ఇది ఎఫ్‌పీఐల సెంటిమెంటును దెబ్బతీసింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం కుంగడం కూడా మరో కారణం. మరికొన్ని రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో రూపాయి మరింత బలహీనపడి 77-77.50 డాలర్ల వరకు పడిపోవచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి:రిస్క్ తక్కువ ఉండే ఉత్తమ పెట్టుబడులు ఇవే!