దేశ విదేశీ మారకపు నిల్వలు జీవనకాల గరిష్ఠానికి చేరాయి. జులై 31తో ముగిసిన వారంలో 1193.80 కోట్ల డాలర్లు పెరిగి 53456.80 కోట్ల డాలర్లకు చేరాయి. ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్ మాట్లాడుతూ 53456.80 కోట్ల డాలర్ల మారకపు నిల్వలు 13.4 నెలల దిగుమతుల విలువకు సమానమని చెప్పడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జులై 31 వరకు విదేశీ మారకపు నిల్వలు 5680 కోట్ల డాలర్లు పెరిగాయని ఆయన అన్నారు.
జులై 24తో ముగిసిన వారంలో మారకపు నిల్వలు 499.30 కోట్ల డాలర్లు అధికమై 52263 కోట్ల డాలర్లుగా నమోదుకాగా.. జూన్ 5తో ముగిసిన వారంలో తొలిసారి అర లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని అందుకున్నాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. జులై 31తో ముగిసిన వారంలో మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1034.70 కోట్ల డాలర్లు పెరిగి 49082.90 కోట్ల డాలర్లకు చేరాయి.
పసిడి నిల్వలు కూడా 152.50 కోట్ల డాలర్లు అధికమై 3762.50 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 1.2 కోట్ల డాలర్లు పెరిగి 147.50 కోట్ల డాలర్లకు చేరగా.. ఐఎంఎఫ్ వద్ద నిల్వల స్థితి 5.4 కోట్ల డాలర్లు అధికమై 463.90 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.