విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) తెగనమ్ముతున్నారు. అవకాశం ఉన్నంత మేరకు ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలిపోవటానికి, దాదాపు 500కు పైగా షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి పతనం కావటానికి ప్రధాన కారణం ఇదే. ముఖ్యంగా విదేశీ సంస్థాగత మదుపరులు పెద్ద కంపెనీల (లార్జ్ క్యాప్) షేర్లలో ఎక్కువగా పెట్టుబడులు పెడతారు. ఈ షేర్లు ప్రధానంగా సూచీల్లో ఉంటాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 100 తదితర సూచీల్లో ఉండే కంపెనీలను ఎంచుకొని వీరు పెట్టుబడి పెట్టటం ఆనవాయితీ. కానీ అనూహ్యంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్- 19) వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇటు వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు కష్టకాలం తప్పదనే అభిప్రాయం బలపడుతోంది. కంపెనీలు మెరుగైన ఆదాయాలు, లాభాలను నమోదు చేసే పరిస్థితి ఉండనే ఉండదు. వచ్చే రెండు, మూడు త్రైమాసికాల పాటు ఇది తప్పదని ఆర్థిక వేత్తలు, వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈక్విటీ షేర్లపై పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని అందించే అవకాశం లేదు. పైగా ప్రస్తుత పెట్టుబడుల విలువ వేగంగా క్షీణించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల విదేశీ మదుపరులు ఈక్విటీ షేర్లను అయినకాడికి అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు దేశీయ స్టాక్‌మార్కెట్లలో కనిపిస్తోంది ఇదే.
గతంలో ఎన్నడూ ఇంతగా లేదు..
మ్యూచువల్ ఫండ్ల సిప్‌ల ద్వారా నెలకు ఏడెనిమిది వేల కోట్ల రూపాయిలు సమీకరించి ఈక్విటీ షేర్లు కొనుగోలు చేస్తున్నందున దేశీయ పెట్టుబడి సంస్థల ప్రభావం పెరిగిందని, కాబట్టి ఎఫ్‌ఐఐల ప్రభావం మన స్టాక్‌మార్కెట్లలో గతంలో ఉన్నంతగా లేదని కొందరు వాదిస్తుండగా, అది తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ధారణ అవుతోంది. ఓపక్క దేశీయ సంస్థాగత మదుపరులు తమ శక్తిమేరకు దేశీయ స్టాక్‌మార్కెట్లలో కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ, విదేశీ మదుపరుల అమ్మకాలకు దేశీయ సంస్థలు సరితూగలేకపోతున్నాయి. గత పది రోజులుగా చూస్తే విదేశీ సంస్థలు స్టాక్‌మార్కెట్లో నగదు విభాగంలో ప్రతి రోజూ సగటున నికరంగా రూ.4,000 కోట్లకు పైగా విక్రయాలు చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ రూ.43,274 కోట్ల మేరకు నికరంగా షేర్లు విక్రయించారు. సెన్సెక్స్, నిఫ్టీలో ఉండే షేర్లలో అధికంగా విక్రయాలు చేస్తున్నందున సూచీలు కూలిపోతున్నాయి. కేవలం గత పదిరోజుల వ్యవధిలో సూచీలు 35 శాతం వరకూ క్షీణించాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ ఇంత వేగంగా, ఇంత అధికంగా సూచీల పతనం చోటు చేసుకోలేదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
దేశీయ సంస్థాగత మదుపరుల అండతో..
దేశీయ సంస్థల కొనుగోళ్లు...: దేశీయ సంస్థల కొనుగోళ్లు లేకపోతే సూచీల పతనం మరింత ఆందోళనకరంగా ఉండేదే. వీరు ఈ నెలలో ఇప్పటి వరకూ ఈక్విటీ నగదు విభాగంలో నికరంగా రూ.37,362.28 కోట్ల మేరకు కొనుగోళ్లు చేశారు. అయినప్పటికీ సూచీలు పతనం కాకుండా ఆపలేని పరిస్థితి. ఈ నెలలో ట్రేడింగ్ ఉన్న రోజుల్లో సగటున రోజుకు రూ.3,500 కోట్ల వరకూ నికర కొనుగోళ్లు చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. కానీ ఇలా ఎంతకాలం దేశీయ సంస్థలు కొనుగోలు చేస్తాయనేది ప్రశ్న. ఇప్పటికే దేశీయ సంస్థలు వల్ల నగదు నిల్వలు తగ్గిపోతున్నట్లు, మార్కెట్లు ఇదేవిధంగా పతనం అవుతూ ఉంటే ఎక్కువ కాలం అవి నికరంగా కొనుగోళ్లు చేయలేవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకొని ఎఫ్‌ఐఐలు కొనుగోళ్లు మొదలు పెట్టగానే, దేశీయ సంస్థాగత మదుపరులు కొంతమేరకు అమ్మకాలు చేపట్టే అవకాశం ఉందని కూడా ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎఫ్‌ఐఐలు చేపట్టిన అమ్మకాలకు దేశీయ స్టాక్‌మార్కెట్లలో మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోతోంది.
ఇదీ చూడండి: స్టాక్ మార్కెట్లు మూసేస్తే.. ప్రత్యామ్నాయం ఉందా?