కరోనాతో స్తంభించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టి, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిని కాపాడేలా కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్ తొలి దశలో భాగంగా 15 ఉద్దీపన చర్యల వివరాల్ని వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో 6 నిర్ణయాలు... లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినవే.
కరోనా కారణంగా మూతపడ్డ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను సత్వరమే తిరిగి తెరిచి, లక్షలాది మంది జీవనోపాధిని కాపాడేందుకు ఈ నిర్ణయాలు ఉపకరిస్తాయని తెలిపారు నిర్మల.
ఎంఎస్ఎంఈల కోసం 6 చర్యలు
- సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు భారీగా రుణాలు ఇవ్వనున్నట్లు నిర్మల తెలిపారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3 లక్షల కోట్లను వాటికి కేటాయించినట్లు స్పష్టం చేశారు. నాలుగేళ్ల పరిమితితో లభించే ఈ రుణాలకు 12 నెలల మారటోరియం వర్తిస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా 45 లక్షల యూనిట్లకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. 2020 అక్టోబర్ 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
- ఆర్థిక కష్టాల్లో ఉన్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు 20 కోట్ల సబ్ ఆర్డినేట్ రుణ సౌకర్యం కల్పించనున్నట్లు నిర్మల తెలిపారు. ప్రభుత్వం తరపున నాలుగు వేల కోట్ల రూపాయలను అందించనున్నట్లు స్పష్టం చేశారు.
- పెట్టుబడి సమస్యలతో సతమతమవుతున్న పరిశ్రమల్లోకి రూ.50 వేల కోట్ల ఈక్విటీని చొప్పించనున్నట్లు ప్రకటించారు నిర్మల. రూ.10 వేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఎంఎస్ఎంఈలు నమోదయ్యేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
- ఎంఎస్ఎంఈల నిర్వచనంలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి. పరిశ్రమల పెట్టుబడి పరిమితిని పెంచారు. ఇదివరకు 25 లక్షల పెట్టుబడి పెట్టే తయారీ రంగ పరిశ్రమను ఎంఎస్ఎంఈగా పరిగణించగా.. ఈ పరిమితిని కోటికి పెంచారు. సేవారంగంలో ఉన్న పరిమితిని 10 లక్షల నుంచి కోటికి పెంచినట్లు తెలిపారు.
- విదేశీ కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలకు వ్యాపార అవకాశాలు మరింత మెరుగుపర్చనున్నట్లు నిర్మల స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లలో ఎమ్ఎస్ఎమ్ఈలు పాల్గొనలేని పరిస్థితి ఉందని అన్నారు. అందువల్ల రూ.200 కోట్ల కన్నా తక్కువ విలువైన ప్రాజెక్టుల్లో విదేశీ టెండర్లకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.
- కరోనా తర్వాత ట్రేడ్ ఫెయిర్స్ నిర్వహణ కష్టమని.. ఈ నేపథ్యంలో ఈ-మార్కెట్ ద్వారా అన్ని ఎమ్ఎస్ఎమ్ఈలను అనుసంధానం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ట్రేడ్ ఫెయిర్స్లో పాల్గొనలేకపోయినా ఎమ్ఎస్ఎమ్ఈలు మార్కెట్‌ను గుర్తించి, వ్యాపారం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.