కరోనా నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ పొదుపు మంత్రం పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెంచిన డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ల మొత్తాల చెల్లింపులను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
వచ్చే ఏడాది జులై వరకు డీఏ, డీఆర్ పెంపుదల నిలుపు ఉండనున్నట్లు తెలిపింది. మొత్తం 50 లక్షల మంది ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లకు ఇది వర్తిస్తుందని వెల్లడించింది.
నిలుపుదల ఇలా..
గత నెలలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ ఏడాది జనవరి నుంచి ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే తాజాగా పెంపును నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి నుంచి 2021 జులై వరకూ అదనపు చెల్లింపులు ఉండవని వెల్లడించింది. అయితే ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ప్రభుత్వానికి ఖజానాకు ఇలా మేలు..
అధికారిక వర్గాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ అదనపు చెల్లింపుల నిలుపుదలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.37,530 కోట్లు ఆదా అవుతుంది. సాధారణంగా డీఏ, ఆర్‌ఏలపై కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు అనుసరిస్తాయి. వీటి ద్వారా రాష్ట్రాల వాటాతో రూ.82,566 కోట్లు ఆదా అవుతుంది. కేంద్రం, రాష్ట్రాల వాటా కలిపి రూ.1.20 కోట్లకు చేరుతుంది. ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటానికి వినియోగించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చూడండి:ఇండిగో ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వేతనాల్లో కోతల్లేవ్