రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితికి మించి అదనపు రుణం పొందడానికి నిర్దేశించిన నాలుగు సంస్కరణలను పూర్తి చేయడానికి కేంద్ర ఆర్థికశాఖ ఫిబ్రవరి 15 వరకు గడువు ఇచ్చింది. 'ఒకేదేశం ఒకే రేషన్ కార్డు', సులభతర వాణిజ్యం, పట్టణస్థానిక సంస్థలు-వాటి సేవల వినియోగం, విద్యుత్తు రంగంలో సంస్కరణలు పూర్తిచేసిన రాష్ట్రాలకు 1శాతం అదనపు రుణం పొందడానికి వీలవుతుంది. ఒక్కో సంస్కరణకు 0.25శాతం అదనపు రుణపరిమితి లభించనుంది. అన్ని రాష్ట్రాలూ ఈ షరతులను పూర్తిచేస్తే బహిరంగ మార్కెట్ నుంచి రూ. 2.14 లక్షల కోట్ల రూపాయల రుణాలను సేకరించుకోవడానికి వీలవుతుంది.
కొవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్రాల ఆదాయం భారీగా పడిపోవడం వల్ల ఎఫ్ఆర్బీఎం కింద ఇప్పుడున్న 3 శాతానికి తోడు మరో 2 శాతం అదనంగా రుణాలు తీసుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ మే17న అనుమతి ఇచ్చింది. దీనికింద రాష్ట్రాలన్నీ కలిపి రూ. 4.27 లక్షల కోట్ల ఆర్థిక వనరులు సమకూర్చడానికి వీలవుతుంది. ఇందులో ఒక శాతం మొత్తాన్ని ఎలాంటి షరతులు లేకుండా తీసుకోవడానికి వీలు కల్పించగా... మిగిలిన ఒక శాతానికి నాలుగు సంస్కరణలను ముడిపెట్టింది.
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని 9 రాష్ట్రాలు మాత్రమే ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానాన్ని అమలులోకి తెచ్చాయి. మరో నాలుగు రాష్ట్రాలు సులభవాణిజ్య షరతులు, ఒక్క రాష్ట్రం మాత్రమే పట్టణ స్థానిక సంస్థలు- వాటి సేవల్లో సంస్కరణలను పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఇప్పుడు సంస్కరణల గడువును పొడిగించినందున మిగిలిన రాష్ట్రాలూ త్వరగా పూర్తిచేసి కేంద్రం అందించిన ఆర్థిక ప్రయోజనాన్ని పొందాలని ఆర్థికశాఖ ఆయా రాష్ట్రాలకు సూచించింది.
తెలుగురాష్ట్రాలకు ఎంతెంత?
ఈ నాలుగు సంస్కరణలు పూర్తి చేస్తే ఏపీకి... రూ. 10,100 కోట్లు, తెలంగాణకు రూ. 10,032 కోట్ల అదనపు రుణ సౌకర్యం లభిస్తుందని ఆర్థికశాఖ ప్రకటన వెల్లడించింది. ఒకే దేశం, ఒకే రేషన్, సులభవాణిజ్య షరతులు పూర్తిచేసినందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రూ. 5,050 కోట్లు, ఇందులో మొదటి సంస్కరణ మాత్రమే పూర్తి చేసినందుకు తెలంగాణ రూ. 2,508 కోట్లు అదనంగా రుణం పొందడానికి అర్హత సంపాదించాయి.