ఇల్లు.. దీనిని మంచి పెట్టుబడి సాధానంగా కూడా పరిగణించవచ్చు. ప్రధాన మార్కెట్లలో ఇటీవల ఇళ్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే.. ఇళ్ల ధరలో హెచ్చుతగ్గులు అంత భారీగా ఉండవు. ఇందుకోసమే ఉత్తమ పెట్టుబడుల్లో ఇల్లు కూడా ఒకటి.
ఇది సరైన సమయమే..
నెల నెలా ఈఎంఐ కట్టటం ద్వారా ఇల్లు సొంతం అవుతుంది. అద్దె ఇల్లు అయితే.. నెల నెలా కొంత చెల్లించటమే కానీ అది ఎప్పటికీ మన సొంతం కాదు. అయితే ఈఎంఐల ద్వారా సొంత ఇల్లు కొనాలనుకుంటే అందుకు ఇది సరైన సమయమేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ప్రస్తుతం వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. దీనితో స్వల్ప వడ్డీకే గృహ రుణాలు పొందొచ్చు.
ఏం కావాలో తెలుసుకోండి..
ముందు మీ అవసరాలకు తగ్గట్లు ఎలాంటి ఇల్లు కొనాలనుకుంటున్నారన్న విషయంపై స్పష్టత తెచ్చుకోండి. ఎందుకంటే భవిష్యత్‌లో ఇల్లు సరిపోవడం లేదు అనే సమస్య రాకుడదు. అపార్ట్‌మెంట్ లేదా ఇండిపెండెంట్ ఇల్లు, 2బీహెచ్‌కే లేదా 3బీహెచ్‌కే అనేది నిర్ణయించుకోవాలి. దీనితో పాటు నగరంలో తీసుకోవాలా? లేదా నగరం శివారుల్లో కావాలా? అనే విషయంపై అంతిమ నిర్ణయం తీసుకొండి. ముఖ్యంగా గృహ రుణం తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని మీరు ఎలాంటి ఇల్లును కొనుగోలు చేయగలరో నిర్ణయించుకోవాలి.
గృహ రుణాలను పోల్చి చూడండి..
గృహ కొనుగోలుకు ప్రస్తుతం బ్యాంకులతో పాటు వివిధ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణాలు ఇస్తున్నాయి. వీటన్నింటిలో ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లతో పాటు, ప్రాసెసింగ్ రుసుములు, ఇతర ఫీజులు ఏమన్నా ఉన్నాయా? ఎందులో తక్కువ వడ్డీ రేటుకు రుణాలు లభిస్తున్నాయి అనేది లెక్కించుకోవాలి. ఇందుకోసం పలు ఆన్లైన్ క్యాలుక్యులేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో మీరు తీసుకునే రుణం వల్ల మీపై వడ్డీ భారం ఎంత పడుతుంది అనేది లెక్కించుకోవచ్చు.
బడ్జెట్ ప్రణాళికకు కట్టుబడి ఉండాలి..
కాలాన్ని బట్టి ఆదాయాలు పెరగటమే కాకుండా ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. కాబట్టి ప్రణాళిక వేసుకుని అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. వివిధ రకాల యాప్‌ల ద్వారా ఖర్చు పెట్టే తీరుపై నిఘా పెట్టొచ్చు. ఇంటిని సొంతం చేసుకోవాలంటే కావాల్సినంత మొత్తాన్ని సమకూర్చుకునేందుకు అనవసర ఖర్చు లు తగ్గించుకోవటం చాలా వరకు ఉపయోగపడుతుంది.
హిడెన్ ఛార్జీల గురించి తెలుసుకోండి..
ఇళ్ల కొనుగోలుకు సంబంధించి హిడెన్ ఛార్జీల ఖర్చులను చాలా మంది ప్లాన్ చేసుకోరు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ లాంటి ఖర్చులు రూ.లక్షల్లో కూడా ఉంటాయి. పన్నులు, ఇతర ఛార్జీల గురించి బిల్డర్లు, ప్రకటనల్లో పేర్కొనకపోవచ్చు. అందుకే ఇల్లు కొనేముందే హిడెన్ ఛార్జీలతో కలిపి మొత్తం ధర ఎంత అవుతుందన్నది ముందే తెలుసుకోవాలి. కొత్త ఇల్లు కొంటే, ఫర్నీచర్ తదితరాలకు ఖర్చులు ఉంటాయి. వీటికి కూడా ముందే ప్రణాళిక వేసుకోవాలి.
పెట్టుబడి పెట్టండి..
ఇళ్లు కొనుగోలు చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికోసం కేవలం పొదుపే కాకుండా ఎక్కువ రాబడి కోసం పెట్టుబడులు కూడా పెట్టాలి. పొదుపు ఖాతాపై కేవలం 3 నుంచి 4 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది. ప్రస్తుత పెరుగుతున్న ధరలతో పోలిస్తే.. ఈ పొదుపు విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. ముఖ్యంగా రిస్క్ తక్కువగా ఉండే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై దృష్టి సారించాలి. పొదుపు ఖాతాతో పోలిస్తే ఇవి ఎక్కువ రాబడిని అందిస్తాయి. ఇంకా ఎక్కువ రాబడి రావాలంటే మ్యూచువల్ ఫండ్లను తీసుకోవచ్చు.
మంచి క్రెడిట్ స్కోరు అవసరం
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు రావాలంటే మంచి క్రెడిట్ స్కోరు ముఖ్యం. క్రెడిట్ స్కోరు బాగుంటే.. వీలైనంత వేగంగా, తక్కువ వడ్డీకే రుణాలు పొందే వీలుంటుంది. క్రెడిట్ స్కోరు.. గృహ రుణానికి సంబంధించి అర్హత సాధించేందుకు కూడా ఉపయోగపడుతుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉండాలంటే.. గడువులోపు రుణ వాయిదాలను చెల్లించటం, అవుట్‌స్టాండింగ్ మొత్తాలను ఎప్పటికప్పుడు చెల్లించాలి.
బ్రోకరేజీ లేకుండా కొనుగోలు చేయండి
గృహాల కొనుగోలు సమయంలో బ్రోకరేజీ చెల్లించటం అనేది అనవసర ఖర్చు. బ్రోకరేజీ లేకుండా లావాదేవీలు జరిపితే ఎక్కువగా పొదుపు చేసుకోవచ్చు. బ్రోకరేజీ లేకుండా కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం చాలా సుదుపాయాలు ఉన్నాయి.