పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్లు ఎగ్గొట్టిన కేసుకు సంబంధించి మనీలాండరింగ్, మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే అంశంపై తుది తీర్పునకు తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 25న తీర్పు వెలువరిస్తామని లండన్ వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శామ్యూల్ గూజీ వెల్లడించారు. నీరవ్ కేసుకు సంబంధించిన చివరి విడత అఫిడవిట్ దాఖలు ముగింపు సందర్భంగా ఈ మేరకు స్పష్టం చేశారు.
పోంజీ వంటి కుంభకోణంతో పీఎన్బీకి తీవ్ర నష్టం కలిగించిన మోసానికి నీరవ్ మోదీ బాధ్యత వహించాల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది. భారత అధికారుల తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్విస్ (సీపీఎస్) కోర్టులో వాదనలు వినిపించింది. మోసం, మనీలాండరింగ్, న్యాయ వ్యవస్థను తప్పుదోవపట్టించటం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే అంశంపై విచారణను ముగించేందుకు.. గతంలో వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్చించిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్నారు న్యాయమూర్తి. ఈ మేరకు తుది తీర్పుపై స్పష్టతనిచ్చారు.
2019,మార్చి 19న అరెస్ట్ అయిన నీరవ్ మోదీ ప్రస్తుతం సౌత్వేస్ట్ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. 28 రోజులకు ఓసారి కోర్టు ముందు వీడియో లింక్ ద్వారా హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న మరోమారు కోర్టుకు హాజరవనున్నాడు.
ఇదీ చూడండి: మస్క్ ఎఫెక్ట్: వాట్సాప్‌కు బై- సిగ్నల్‌కు జై!