ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కరోనా వైరస్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఫావిపిరవిర్ (200 ఎంజీ) ఔషధాన్ని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. దీన్ని తీసుకున్న రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నట్లు ఔషధ కంపెనీలు పేర్కొంటున్నాయి. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. అయిదు కాదు, పది కాదు, బాధితులు దాదాపు 100 ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లు మింగాల్సి వస్తోంది. అదీ 10 రోజుల వ్యవధిలోనే.
తొలి రోజు 18 ట్యాబ్లెట్లు, ఆ తర్వాత దాదాపు 9 రోజుల పాటు రోజుకు 8 ట్యాబ్లెట్లు తీసుకోవాలి. కొందరు 14 రోజుల పాటూ వాడాల్సి వస్తోంది. కొన్ని కంపెనీలు ఇందులో 400 ఎంజీ ట్యాబ్లెట్ తయారు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ఆ డోసు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో అసలు ట్యాబ్లెట్‌కు బదులు సూదిమందు తయారు చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీలకు వచ్చింది. దీంతో పెద్దఎత్తున పరిశోధనలు చేపట్టాయి.
హైదరాబాద్ నుంచే..
ఒక అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ ఇంజక్షన్ తయారీకి దాదాపుగా సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఈ సంస్థ ఇప్పటికే ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లు విడుదల చేసింది. ఇంజక్షన్ తయారీ పరిజ్ఞానాన్ని తన ల్యాబ్‌లో పరీక్షించి చూస్తున్నట్లు, త్వరలోనే దీన్ని తయారు చేసి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. దీని ప్రకారం... ఇప్పటికే ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ల తయారీలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ నుంచే ఇంజక్షన్ రాబోయే అవకాశాలున్నాయి.
'ఫావిపిరవిర్' తయారీలో అగ్రగామి
ఈ యాంటీ-వైరల్ ఔషధాన్ని జపాన్‌కు చెందిన ఫ్యూజీఫిల్మ్ కార్పొరేషన్‌కు చెందిన టయోమా కెమికల్ కంపెనీ ఆవిష్కరించింది. ఎన్నో ఏళ్లుగా జపాన్‌తో పాటు పలు దేశాల్లో 'అవిగన్' అనే బ్రాండు పేరుతో విక్రయిస్తోంది. ప్రధానంగా ఇన్‌ఫ్లుయంజా వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారు. కొవిడ్-19 కు సరైన మందులు లేని పరిస్థితుల్లో ఫావిపిరవిర్‌ను ప్రయోగాత్మకంగా కొద్ది మంది రోగులకు ఇచ్చినప్పుడు వారు త్వరగా కోలుకున్నారు. ఫలితంగా దీనికి ప్రాధాన్యం పెరిగింది.
రెండు నెలల క్రితం మనదేశంలో తొలిసారిగా గ్లెన్‌మార్క్ ఫార్మా ఫావిపిరవిర్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించింది. దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి అత్యవసర వినియోగ అనుమతి జారీ చేసింది. ఆ తర్వాత దాదాపు ఒక డజనుకు పైగా కంపెనీలు ఈ జనరిక్ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విడుదల చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఔషధాన్ని తయారు చేయటంలో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీలు అగ్రస్థానంలో ఉండటం. ఇప్పటికే 10కి పైగా స్థానిక ఫార్మా కంపెనీలు దీన్ని తయారు చేస్తున్నాయి.
ఎగుమతులు కూడా...
స్థానిక ఫార్మా కంపెనీలు ఫావిపిరవిర్ బల్క్ డ్రగ్, ట్యాబ్లెట్లను పెద్దఎత్తున తయారు చేసి దేశీయ మార్కెట్‌కు అందించటంతో పాటు ఎగుమతులు కూడా చేస్తున్నాయని తెలంగాణ ఔషధ నియంత్రణ సంస్థ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ వివరించారు. ఇక్కడి ఫార్మా కంపెనీలు రోజుకు 10 లక్షల ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లు తయారు చేస్తున్నాయి, వీటిని దేశీయంగా విక్రయించటంతో పాటు విదేశాలకు సరఫరా చేస్తున్నాయి- అని ఆయన పేర్కొన్నారు.
ఈ కంపెనీలు ఇప్పటి వరకూ 1.10 కోట్ల ట్యాబ్లెట్లను ఎగుమతి చేసినట్లు వెల్లడించారు. ఫావిపిరవిర్ బల్క్ డ్రగ్ కూడా పెద్దఎత్తున ఎగుమతి అవుతున్నట్లు నవీన్ కుమార్ తెలిపారు.
ధర తగ్గుతుందా?
తొలుత దేశీయ మార్కెట్లో ఫావిపిరవిర్ 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను గ్లెన్‌మార్క్ ఫార్మా రూ.103 ధరకు విడుదల చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు రూ.75కు తగ్గించింది. కానీ పలు కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేయటం మొదలు పెట్టిన తర్వాత ట్యాబ్లెట్ ధర బాగా దిగివచ్చింది. ఇప్పుడు రూ.35 కు ఒక ట్యాబ్లెట్ విక్రయించే కంపెనీలు ఉన్నాయి. కానీ ఉత్పత్తి ఇంకా పెరగటం, త్వరలో ఇంజక్షన్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ ఔషధం ధర ఇంకా తగ్గే వీలుందని స్థానిక ఫార్మా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే చాలా మంది కొవిడ్- 19 బాధితులకు ఉపశమనం కలుగుతుంది.
ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ తయారు చేస్తున్న స్థానిక ఫార్మా కంపెనీలు
- హెటిరో ల్యాబ్స్
- ఆప్టిమస్ ఫార్మా
- జనేరా ఫార్మా
- ఫ్యూజన్ హెల్త్‌కేర్
- లీ ఫార్మా
- ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్
- కన్‌వెర్జ్ బయోటెక్
- మైలాన్ ల్యాబ్స్
- వీవిమెడ్ ల్యాబ్స్
- డాక్టర్ రెడ్డీస్
- రాఘవ లైఫ్‌సైన్సెస్
డాక్టర్ రెడ్డీస్ జపాన్‌కు చెందిన ఫ్యూజీఫిల్మ్ కెమికల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని నేరుగా 'అవిగన్' బ్రాండు పేరుమీదే ఈ ఔషధాన్ని విడుదల చేసింది.
రాఘవ లైఫ్ సైన్సెస్ ‘ఫావిపిరవిర్’ బల్క్ డ్రగ్ తయారు చేసి ఇతర కంపెనీలకు విక్రయిస్తోంది.
ఇదీ చూడండి: కరోనాకు చెక్ పెట్టే ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ రూ.33కే!