కొత్త ఏడాది జనవరి 1 నుంచి దేశంలోని అన్ని రకాల వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనివల్ల టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ పద్ధతిలో రుసుములు చెల్లించవచ్చని,.. ఫలితంగా రద్ధీ తగ్గడమే కాకుండా వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు. గురువారం ఓ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ రుసుం చెల్లించే ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని 2016లోనే ప్రారంభించింది కేంద్రం. ఆ ఏడాది నాలుగు బ్యాంకులు కలిసి దాదాపు లక్ష ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేశాయి. ఆ తర్వాత 2017లో ఫాస్ట్‌ట్యాగ్‌ల సంఖ్య 7 లక్షలకు పెరిగింది. 2018లో ఏకంగా 34లక్షలకు పైగా ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేశారు.
పాత వహనాలు, 2017 డిసెంబర్ 1కి ముందు వరకు విక్రయించిన వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అని ఈ ఏడాది నవంబర్లోనే నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. 1989 కేంద్ర మోటారు వాహనాల నిబంధనల మేరకు కొత్త వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరణకు ఫాస్ట్‌ట్యాగ్ కావాల్సిందేనని స్పష్టం చేసింది.