చైనాలోని సగం ప్రావిన్స్ దేశాలు పరిశ్రమల మూతను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. కరోనా ప్రభావమున్న ప్రాంతాల నుంచి కార్మికులు వెనక్కి తిరిగి రాకుండా ఉండేందుకు కొత్త ఏడాది సెలవులను ఫిబ్రవరి 17 వరకు పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. చైనాలోని కొన్ని అంతర్జాతీయ కార్ల తయారీ కంపెనీలు వచ్చే రెండు వారాలకు కానీ తయారీని తిరిగి మొదలుపెట్టే యోచనలో లేవు. మరికొన్ని ఎప్పటి నుంచి తయారీ ప్రారంభించాలో ఇంకా తేల్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 17 తేదీని కూడా పొడిగించకుండా ఉంటారన్న హామీ ఏమీ కనిపించడం లేదు. కంపెనీలు ఇలా మూతపడి ఉన్నంతకాలం అనిశ్చితి పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు.
మూతపడితే ఏం..?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలకు చైనాలోని కంపెనీల నుంచే ఎక్కువ భాగం విడిభాగాలు వెళుతుంటాయి. ముఖ్యంగా వాహన, మన్నికైన వినియోగదారు వస్తువులు, ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమలకు ఇప్పటికే చైనా నుంచి సరఫరా తగ్గిందన్న భావనలో ఉన్నాయి. వాహన రంగం వాడే షీట్ మెటల్, ఎలక్ట్రానిక్ భాగాలు, మన్నికైన వినియోగదారు తయారీ కంపెనీలకు త్వరలోనే సరఫరా కొరత ఏర్పడనుందని అంచనా.
భారత్‌లోనూ..
చాలా వరకు తయారీ కంపెనీలకు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ ఉండడంతో వాటి తక్కువ ఉత్పత్తి వల్ల ఇబ్బందులు వస్తున్నాయని.. అందుకు భారతేమీ మినహాయింపు కాదని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ అంటున్నారు. భారీ ఉత్పత్తి వస్తువులకు సరఫరాదార్లను మార్చడం ప్రస్తుతానికి మంచిది కాదని.. వేచిచూడడమే మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రతినిధి కూడా ఇదే భావనను వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 17 తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు. ఇది కేవలం భారత వాహన పరిశ్రమకే కాదు.. చైనా విడిభాగాలపై ఆధారపడి ఉన్న అన్ని దేశాల కంపెనీలకూ ఇబ్బందేనని అంటున్నారు. చైనా సరఫరాలపై ఆధారపడి ఉన్న భారత పరిశ్రమలకు ప్రత్యామ్నాయ సరఫరాదారు లభించడం అంత సులువు కాదు. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న ఈ తరుణంలో ఇలా జరగడం కొరుకుడు పడని అంశమేనని నిపుణులు అంటున్నారు.
ఫిబ్రవరి దాటితే..‘మొబైల్’ మోగదు
ప్రస్తుత అనిశ్చితి చెప్పి వచ్చింది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టును పూర్తి చేయాలన్న క్లాజు కూడా ఏమీ ఉపయోగపడకపోవచ్చని కంపెనీ ప్రతినిధులే అంటున్నారు. ఇది తప్పనిసరి పరిస్థితుల్లో సరఫరాను నిలిపివేస్తున్నట్లు నిరూపిస్తే ఆర్థిక నష్టాలను వాళ్లు పూడ్చక్కర్లేదు. మరోవైపు ఫిబ్రవరి దాటితే మరింత అనిశ్చితి కనిపించవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నారు. సాధారణంగా మొబైల్‌కంపెనీలు 8-12 వారాల ఉత్పత్తికి ప్రణాళికలను రచించుకుంటారు. ప్రస్తుతం 90% వరకు మొబైల్‌ఫోన్లు భారత్‌లోనే అసెంబ్లింగ్ చేస్తున్నప్పటికీ.. కొన్ని ముఖ్య భాగాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఫిబ్రవరి తర్వాత కూడా విడిభాగాలు రాకుంటే.. వచ్చే 2-3 నెలల వరకు ఆ ప్రభావం కనిపిస్తుంది.
ఇదీ చదవండి: కరోనా ప్రభావం: హోటళ్లకు దడ