కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీని వల్ల ఎవరూ బయటకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఖాళీగా ఉన్నవారు సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పలు ఎంటర్టైన్మెంట్ షోలు, వీడియో గేమ్‌లు ఆడుతున్నారు. ఈ తరుణంలో ఫేస్బుక్ ఓ గేమింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వినియోగదారులకు ఉచితంగా ఈ యాప్‌ను అందించనుంది సోషల్ మీడియా దిగ్గజ సంస్థ.
వాటికి పోటీగా
ప్రస్తుతం లాక్డౌన్ వల్ల లైవ్ స్ట్రీమింగ్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పటికే లైవ్ ప్లాట్ ఫామ్స్‌గా మంచి ఆదరణ సంపాదించుకున్న ట్విచ్, యూట్యూబ్‌కు పోటీగా ఫేస్బుక్ కొత్త గేమింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనిద్వారా కోట్ల మంది వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లలో ప్రత్యక్షంగా గేమింగ్ టోర్నమెంట్లను వీక్షించవచ్చు.
త్వరలో ఐఓఎస్ వెర్షన్‌లోకి
ప్రస్తుతం ఈ యాప్‌ను ఫేస్బుక్ ఆండ్రాయిడ్ ఫోన్లలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక యాపిల్ సంస్థ నుంచి ఆమోదం లభిస్తే త్వరలో ఐఓఎస్ వెర్షన్లోనూ ఈ గేమింగ్ యాప్‌ను విడుదల చేయనుంది.
ఆ బటన్‌ను ఉపయోగించి
ఈ యాప్‌లో గో లైవ్ అనే ఫీచర్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు ఇతర మొబైల్ గేమ్స్ స్ట్రీమ్‌లను ఆప్‌లోడ్ చేసుకోవచ్చు.
" గేమింగ్‌పై పెట్టుబడులు పెట్టడమే ప్రస్తుతం ప్రాధాన్యంగా మారింది. ఈ ఆటల వల్ల ప్రజలు ఎక్కువగా వినోదాన్ని పొందుతున్నారు. అయితే వినియోగదారులను అనుసంధానం చేస్తూ వినోదం పంచడం వల్ల వారు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా ఒక్క దగ్గరే ఉన్నట్లు భావిస్తారు. "
-- ఫిద్జీ సిమో, ఫేస్బుక్ గేమింగ్ యాప్ అధినేత
ఈ గేమింగ్ యాప్ కొన్ని సాధారణ ఆటలను కలిగి ఉన్నప్పటికీ ప్రధానంగా లైవ్ స్ట్రీమ్లనే కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈ యాప్ ప్రారంభంలో ఎటువంటి ప్రకటనలు ఉండవు. లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలో 18 నెలలుగా ఈ యాప్ వెర్షన్లను పరీక్షిస్తోంది ఫేస్బుక్.
ఇదీ చదవండి: 'ప్రపంచంలో అతిపెద్ద అన్నదాన కార్యక్రమం రిలయన్స్‌దే'