తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటినుంచి పనిచేసేలా ప్రత్యామ్నాయాన్ని కల్పిస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. అలాగే వారి నివాస స్థలాలు మార్చుకునే వెసులుబాటును ఇస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 15 నుంచి ఉద్యోగులకు ఈ అవకాశాన్ని ఇవ్వనుంది. 'మనం ఎక్కడి నుంచి పనిచేస్తున్నామనే దానికంటే ఎలా పనిచేస్తున్నామనేదే ముఖ్యం. ఉత్తమంగా పనిచేయగల ప్రదేశంలోనే ఉద్యోగులు ఉండాలని మేం కోరుకుంటున్నాం' అని ఫేస్‌బుక్ మీడియాకు వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు పలు సంస్థలు అవకాశం ఇచ్చాయి.
శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్..?
అలాగే ఇంటి నుంచి పని(వర్క్ ఫ్రమ్ హోమ్) శాశ్వతం కానుందని తాను భావిస్తున్నట్లు ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ అన్నారు. దానిలో భాగంగా నివసించే ప్రాంతం నుంచి పనిచేయగల ఉద్యోగుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోపక్క ఏడాదిన్నర కాలంగా మూసి ఉంచిన కార్యాలయాలను ఫేస్‌బుక్ తిరిగి తెరుస్తోంది. అంతేకాకుండా తిరిగి వచ్చే ఉద్యోగుల షెడ్యూల్ కూడా సరళంగా ఉంటుందని చెప్పింది.
జూన్ 15 నాటికి పలు దేశాలకు ఇంటి నుంచి పని సౌలభ్యాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ప్రముఖ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ దీనిపై తమ విధానాన్ని ప్రకటించాయి.
ఇవీ చదవండి: వివాదాస్పద పాలసీకి ఫేస్‌బుక్ గుడ్‌బై!