ఫేస్బుక్ ఇండియా లాభాల బాటలో దూసుకుపోయింది. ఏడాది కాలంలో ఆ కంపెనీ ఆదాయం 43శాతం పెరిగి రూ.1,277 కోట్లకు చేరుకుంది. నికర లాభంలో రెట్టింపు వృద్ధి నమోదై.. రూ.135.7 కోట్లకు చేరింది.
2019, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆ కంపెనీ మొత్తం ఆదాయం రూ.893.4 కోట్లుగా ఉంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఆ కంపెనీ నికర లాభం 107 శాతం పెరిగి రూ.135.7కోట్లకు చేరింది. అంతకు ముందటి సంవత్సరంలో రూ.65.3 కోట్లుగా ఉంది. ఈ తాజా ఫలితాలపై స్పందించిన ఆ కంపెనీ ప్రతినిధి.. ఫేస్బుక్కు భారత మార్కెట్ అత్యంత ప్రధానమైందని అన్నారు.
అంతకుముందు నవంబర్లో గూగుల్ ఇండియా.. తమ ఆదాయ వివరాలను వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం 34.8 శాతానికి పెరిగి, రూ.5,593.8 కోట్లకు చేరుకుందని తెలిపింది.
ఈక్వలైజేషన్ లెవీ కింద ఫేస్బుక్ ఈ ఏడాది రూ.369.5 కోట్లను చెల్లించింది. ప్రకటనలు ప్రదర్శించినందుకుగాను ఈక్వలైజేషన్ పన్ను కింద భారత ప్రభుత్వం.. గ్లోబల్ డిజిటల్ కంపెనీల నుంచి 6 శాతం పన్నును వసూలు చేస్తోంది.
ఇదీ చూడండి:ఆ నిబంధనలతో టేక్ హోం శాలరీలో కోత?