ఈ ఏడాది మే 15 నుంచి జూన్ 15 మధ్య తమ వేదికపై నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్ వెల్లడించింది. వీటిలో చాలా కంటెంట్లను తొలగించగా.. కొన్నింటిని కవర్ చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు నూతన ఐటీ నిబంధనల ప్రకారం తొలి నెలవారీ పారదర్శక నివేదికను కంపెనీ విడుదల చేసింది.
సామాజిక మాధ్యమాలకు సంబంధించి నూతన ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. ఆయా సంస్థలు అభ్యంతరకరమైన కంటెంట్‌పై పర్యవేక్షణ.. వాటి తొలగింపు వంటి వివరాలను నెలకోసారి అందజేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఫేస్‌బుక్ నిన్న నివేదిక విడుదల చేసింది. మే 15 - జూన్ 15 మధ్య ఫేస్‌బుక్‌లో 10 కేటగిరీల కింద 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకోగా.. అనుబంధ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ వేదికపై 20లక్షల కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
ఎక్కువగా నకిలీ కంటెంటే..
ఫేస్‌బుక్‌లో చర్యలు తీసుకున్న కంటెంట్లలో అత్యధికం నకిలీ వార్తలకు సంబంధించినవే కావడం గమనార్హం. 2.5కోట్ల స్పామ్ సంబంధిత కంటెంట్, హింసను ప్రేరేపించేలా ఉన్న 25లక్షల పోస్టులు, నగ్నచిత్రాలు, లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన 18లక్షల కంటెంట్లు, విద్వేషాన్ని పెంచేలా ఉన్న 3లక్షల పోస్టులు, ఆత్మహత్యలకు సంబంధించి 5.8లక్షల పోస్టులు, వేధింపులు, ఉగ్రవాద ప్రచారం వంటి కంటెంట్లపై కంపెనీ చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. వీటిలో పోస్టులు, ఫొటోలు, వీడియోలు, కామెంట్లు ఉన్నాయి. ఈ కంటెంట్లపై ఫేస్‌బుక్ రెండు రకాలుగా చర్యలు తీసుకుంది. తీవ్ర అభ్యంతరకరంగా ఉన్న వాటిని ప్లాట్‌ఫామ్ నుంచి పూర్తిగా తొలగించామని, కొన్నింటిని ఆడియెన్స్ వార్నింగ్‌తో కవర్ చేశామని కంపెనీ తెలిపింది.
యూజర్లకు రక్షణాత్మకమైన వేదిక..
ఇక ఇన్‌స్టాగ్రామ్ వేదికపై 20లక్షలకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి ఇది మధ్యంతర నెలవారీ నివేదిక మాత్రమే అని, జులై 15న పూర్తి నివేదికను విడుదల చేస్తామని ఫేస్‌బుక్ తెలిపింది. తుది నివేదికలో యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై చేపట్టిన చర్యలతో పాటు వాట్సాప్‌కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడిస్తామని తెలిపింది. "మా మాధ్యమంలో యూజర్లకు రక్షణాత్మకమైన వేదికను ఏర్పాటు చేయడంతో పాటు వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించుకునేందుకు వీలుగా సాంకేతికతలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. మా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్లను పర్యవేక్షించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు మా బృందం కూడా నిరంతరం పనిచేస్తోంది" అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి చెప్పుకొచ్చారు.
ఇటీవల గూగుల్ కూడా నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తమకు యూజర్ల నుంచి 27వేలకు పైగా ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించి దాదాపు 60వేల కంటెంట్లను తమ మాధ్యమం నుంచి తొలగించామని గూగుల్ తన నివేదికలో పేర్కొంది. ఇందులో అత్యధికంగా 96శాతం కాపీరైట్‌కు సంబంధించినవే అని తెలిపింది.
వివిధ సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణ కోసం.. కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కొత్త నియమ నిబంధనలను ప్రకటించింది. అవన్నీ తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే... దిగ్గజ సామాజిక వేదిక(50 లక్షల రిజిస్టర్డ్ వినియోగదారులున్నవి... ట్విటర్, వాట్సప్, ఫేస్‌బుక్, గూగుల్ లాంటివి)లకు మాత్రం వీటి అమలుకు వీలుగా 3నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో మే 26 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనలను పాటించేందుకు ఫేస్‌బుక్, గూగుల్ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ట్విటర్ మాత్రం కొత్త నిబంధనలు అమలు చేయలేదు. దీంతో ఆ సంస్థ భారత్‌లో మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయింది.
ఇవీ చదవండి:ట్విట్టర్లో బూతు బొమ్మలు- వారిపై 10 రోజుల్లో చర్యలు!