కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసుల పునఃప్రారంభం విషయమై బుధవారం నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా నిర్ణయం తీసుకోలేదు. మే 3 వరకు కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినందున, ఆరోజు రాత్రి 11.59 గంటల వరకు సర్వీసులు ఉండవని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. తదనంతరం ఏం చేయాలనే విషయమై ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వలేదు. కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చేవరకు ప్రయాణికుల విమానాలకు అనుమతి ఇచ్చేది లేదని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్ పూరి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే దేశీయంగా సర్వీసులు నిర్వహిస్తున్న 6 దిగ్గజ విమానయాన సంస్థల్లో 4 మాత్రం టికెట్లు విక్రయించేస్తున్నాయి. దేశీయ విపణిలో ఈ సంస్థల వాటాయే 80 శాతం కావడం గమనార్హం.
- దేశీయ విమానయాన విపణిలో అగ్రస్థానం కలిగిన ఇండిగోతో పాటు సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ విస్తారా ఎయిర్‌లైన్స్ కూడా జూన్ 1 నుంచి ప్రయాణానికి టికెట్లు విక్రయిస్తున్నాయి.
- దేశీయంగా రెండో పెద్ద సంస్థ అయిన స్పైస్‌జెట్, గో ఎయిర్ మే 16 నుంచి దేశీయ మార్గాల్లో టికెట్లు అమ్ముతున్నాయి.
- ప్రభుత్వరంగ ఎయిర్ ఇండియాతో టాటాసన్స్, మలేసియాకు చెందిన ఎయిరేసియా బెర్హాద్ సంయుక్త సంస్థ అయిన ఎయిరేసియా ఇండియా మాత్రం టికెట్లు విక్రయించడం లేదు.
24 విమానాలతోనే..
లాక్‌డౌన్ తరవాత ఎయిరేసియా ఇండియా 24 విమానాలతో కార్యకలాపాలు సాగించవచ్చని సమాచారం. ప్రస్తుతం సంస్థ వద్ద 29 విమానాలుండగా, ఇందులో 21 దేశీయ సర్వీసులకు వినియోగిస్తోంది. విమాన సర్వీసులకు ఎప్పుడు అనుమతి వచ్చినా, ప్రయాణికుల నుంచి గిరాకీ సాధారణ స్థాయికి చేరేందుకు చాలా సమయం పట్టొచ్చని సంస్థ భావిస్తోంది. అందువల్ల విమానాలు, సర్వీసుల సంఖ్య తగ్గించుకోవాలనే సంస్థ భావిస్తోంది.
ఇదీ చూడండి: పెను సంక్షోభం... అయినా కోలుకునే అవకాశం