గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2019-20) సంబంధించి ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇది 8.5 శాతంగా ఉంది. దాన్ని 8.1 శాతానికి కుదించొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే దాదాపు 6 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులపై ప్రభావం పడుతుంది. గత ఆర్థిక సంవత్సరానికి వడ్డీని 8.5 శాతంగా నిర్ధరిస్తూ మార్చి మొదటివారంలో ప్రకటన వెలువడింది. అయితే ఆర్థిక మంత్రిత్వశాఖ ఇంకా దీనికి ఆమోద ముద్ర వేయలేదు. అక్కడ ఆమోదం లభించాకే కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. "8.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా ఈపీఎఫ్‌వోకు డబ్బు పంపిణీ చేయడం చాలా కష్టం. నగదు ప్రవాహం బాగా తగ్గిపోవడమే ఇందుకు కారణం" అని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వం ఈపీఎఫ్ చందాలో ఉద్యోగులు, యాజమాన్యాల వాటాను మూలవేతనంలో 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.
ఇదీ చూడండి: పాక్షిక వర్ణ అంధత్వమున్నా డ్రైవింగ్ లైసెన్స్