అమెరికాకు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ సరికొత్త ఎంట్రీ లెవల్ బైక్ ఫొటోస్ ఇంటర్నెట్లో లీకయ్యాయి. త్వరలోనే ఈ కొత్త బైక్‌ను భారత్‌లో ఆవిష్కరించాలని హార్లే డేవిడ్సన్ కసరత్తు చేస్తుండటం గమనార్హం. ఈ ఎంట్రీ లెవల్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్కు గట్టి పోటీ ఇస్తుందనే అంచనాలున్నాయి.
2019లో హార్లే డేవిడ్సన్.. చైనాకు చెందిన వాహన తయారీ సంస్థ కియాన్జియాంగ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి హార్లే ఎంట్రీ లెవెల్ బైక్‌పై ఊహాగానాలు పెరిగిపోయాయి. ఇటాలియన్ బైక్ బ్రాండ్ బెనెల్లీ మాతృసంస్థే ఈ కియనాన్జియాంగ్.
ఆటోమొబైల్ విశ్లేషకుల ప్రకారం.. హార్లే కొత్త బైక్ బెనెల్లీ 302ఎస్‌ను పోలి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కొత్త బైక్ ప్రధానంగా ఆసియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. లీకైన ఫొటోలు చూస్తే.. కొత్త బైక్ బ్లాక్ కలర్లో రానున్నట్లు అర్థమవుతోంది.
అయితే ఇంత వరకు హార్లే డేవిడ్సన్ గానీ, కియాన్‌జియాంగ్ కానీ తమ సంయుక్త ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
హార్లే కొత్త బైక్‌పై అంచనాలు
- 296సీసీ వి-ట్విన్, 30 హార్స్పవర్ ఇంజిన్
- బైక్ బరువు దాదాపు 160 కిలోలు
- 1400 ఎంఎం వీల్‌బేస్
- వెనకవైపు 16 అంగుళాలు, ముందువైపు 15 అంగుళాల అలాయ్ వీల్స్
- టాప్ స్పీడ్ గంటకు 130 కిలోమీటర్లు
- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్
ఈ కొత్త బైక్‌ను భారత్‌కు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్‌లో హార్లే తమ తయారీ ప్లాంట్‌ను గత ఏడాది పూర్తిగా మూసేసింది. విక్రయాలకోసం హీరో మోటోకార్ప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇదీ చదవండి:ఐపీఓల్లో మదుపు.. ఇవన్నీ చూశాకే..