కరోనా కారణంగా యావద్దేశం లాక్డౌన్లో ఉంది. పరిశ్రమలు మూతపడ్డాయి. వ్యాపారాలన్నీ నిలిచిపోయాయి. చేసేందుకు పని లేదు. జీతం వస్తుందన్న నమ్మకం లేదు. ఈ పరిస్థితి ఎంతకాలమో ఎవరికీ తెలియదు. లాక్డౌన్ ముగిసినా... ఉద్యోగం ఉంటుందో, ఉండదో స్పష్టత లేదు. దేశంలోని వేతన జీవులందరి పరిస్థితి ఇదే. మరి వారి భవిష్యత్‌కు భరోసా ఏంటి? సంస్థల యజమాన్యాలు.... ఉద్యోగుల్ని ఒక్కసారిగా తొలగించవచ్చా? అంటే ఔననే అంటోంది పారిశ్రామిక వివాదాల చట్టం.
చట్టంలో ఏముంది?
"ప్రకృతి విపత్తుల సమయంలో యాజమాన్యాలు ఉద్యోగులను తొలగించవచ్చు"... పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2(కేకేకే) సారాంశం ఇది. కరోనా సంక్షోభాన్నీ ప్రభుత్వాలు ప్రకృతి విపత్తుగానే పరిగణిస్తున్నాయి. ఫలితంగా సెక్షన్ 2... ప్రస్తుత పరిస్థితికి వర్తిస్తుందన్నది నిపుణుల మాట.
"ప్రస్తుతం ఉద్యోగులు విధులకు హాజరయ్యే పరిస్థితి లేదు. వారి భద్రతకు భరోసా లేదు. ఉద్యోగులు, వినియోగదారుల ఆరోగ్యం, భద్రత.. రెండింటికీ బాధ్యత వహించాల్సిన క్లిష్ట పరిస్థితిలో యజమాని ఉన్నాడు. అందుకే ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో.... ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించినట్లే(లే ఆఫ్‌గా) పరిగణించాలి."
-అనుపమ్ మాలిక్, సెంట్రమ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్, గురుగ్రామ్
ఉద్యోగుల హక్కుల సంగతేంటి?
ఉద్యోగులు, యజమానులు... ఇద్దరి హక్కులు, ప్రయోజనాలు కాపాడేలా పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 25-ఎఫ్‌లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.
''12 నెలల్లో ఉద్యోగి 45 రోజులకన్నా ఎక్కువ 'లే ఆఫ్'లో ఉంటే... మొదటి 45 రోజుల తర్వాత యజమాని ఎలాంటి పరిహారం చెల్లించనవసరం లేదు. 45 రోజులు దాటినా లే ఆఫ్‌లోనే ఉంటే... ఆ ఉద్యోగిని తొలగించే అధికారం యజమానికి ఉంటుంది.
ఒకవేళ 45 రోజులలోపు లే ఆఫ్ ఉంటే... ఆ ఉద్యోగి పని రోజులకు(వారాంతపు సెలవు మినహా) సగం జీతాన్ని నష్టపరిహారంగా పొందేందుకు అర్హుడు. అయితే... నియామక పత్రంలో పేర్కొని ఉంటేనే పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 25-ఎఫ్ వర్తిస్తుంది." అని వివరించారు అనుపమ్.
మరి కేంద్రం అలా చెప్పిందెందుకు?
ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు మానవతా దృక్పథంతో ఆలోచించి... మార్చి 31 వరకు వేతనాలు చెల్లించాలని సూచించింది కేంద్రం. అయితే.. ఇది సూచన మాత్రమేనని, చట్టపరంగా తప్పనిసరిగా అమలుచేయాల్సిన పరిస్థితి లేదని చెబుతున్నారు అనుపమ్.
"ఉద్యోగులకు 2020 మార్చి వరకు జీతాలు చెల్లించడం సబబే. అయితే... రానున్న కాలంలో కార్యకలాపాలు కొనసాగించే అంశంపై స్పష్టత ఇస్తూ యాజమాన్యాలు ఉద్యోగులకు నోటీసులు ఇవ్వాలి.
లాక్డౌన్ కాలానికి వేతనాలు చెల్లించాలనడం సూచన మాత్రమే తప్ప ఆదేశమో, ఆర్డినెన్సో కాదు. వనరులు అందుబాటులో ఉన్నంతవరకే ఆ సలహాను పాటించడం సాధ్యం.
వేతనాలు చెల్లించాలని కేంద్రం సూచించినంత మాత్రాన ఉద్యోగికి ఎలాంటి హక్కులు సంక్రమించవు. ఎందుకంటే... అలా జరిగితే అది విపత్తు నిర్వహణ చట్టంలోని ప్రభుత్వ విధులు, బాధ్యతల్ని..., రాజ్యాంగం ప్రకారం యజమానులకు ఉన్న హక్కులను కాలరాసినట్టే. అందుకే... వేతనాల చెల్లింపు, ఉద్యోగుల తొలగింపుపై పారిశ్రామిక వివాదాల చట్టమే అంతిమం."
-అనుపమ్ మాలిక్, సెంట్రమ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్, గురుగ్రామ్