Elon Musk Wealth: కొత్త ఏడాదిలో అపర కుబేరుడు ఎలన్ మస్క్ లక్కీ ఛాన్స్ కొట్టారు. కేవలం ఒక్క రోజులోనే ఆయన సంపద రూ.223 కోట్లకు పైగా పెరిగింది.
మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ తయారీ సంస్థ అయిన టెస్లా.. నాలుగో త్రైమాసికంలో అత్యధిక సంఖ్యలో కార్లను డెలివరీ ఇచ్చినట్లు ప్రకటించింది. దీంతో టెస్లా స్టాక్స్.. సోమవారం మార్కెట్ సెషన్లో సుమారు 13.5 శాతం పెరిగాయి. ఒక్కో షేర్ విలువ 1,199.78 డాలర్లకు పెరిగింది. దీంతో మార్కెట్ విలువ 144 బిలియన్ డాలర్లు ఎగబాకింది.
నాలుగో త్రైమాసికానికి గానూ టెస్లా 3 లక్షల 8 వేల ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు డెలివరీ చేసింది. ఇది మార్కెట్ విశ్లేషకులు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం డెలివరీలు 87% పెరిగాయి. కరోనా కారణంగా మార్కెట్లో చిప్‌ల కొరత, ఇతర లాజిస్టికల్ సమస్యలు ఉన్నా కానీ సంస్థ ఎక్కువ డెలివరీలు ఇవ్వడం, కొత్త ఏడాదిలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొన్న కారణంగా మదుపరులు టెస్లా షేర్లను భారీగా కొనుగోలు చేశారు. దీంతో టెస్లా లాభాల నుంచి మస్క్‌కు 33 బిలియన్ డాలర్లు (సుమారు రూ.223కోట్లు) వచ్చి చేరాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం మస్క్ నికర ఆస్తి విలువ 304 బిలియన్ డాలర్లుగా ఉంది.
కార్లను అద్దెకు ఇచ్చే కంపెనీ అయిన హెర్ట్జ్.. భారీ ఆర్డర్‌ను టెస్లాకు ఇచ్చింది. మూడు మోడళ్లలో లక్ష కార్లను ఆర్డ్ ఇచ్చింది. దీంతో గతేడాది అక్టోబర్‌లో టెస్లా ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూను సొంతం చేసుకుంది. మరో వైపు మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ షేర్లు కూడా జీవనకాల గరిష్ఠాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి: 3 ట్రిలియన్ డాలర్ల తొలి కంపెనీగా 'యాపిల్' ఘనత!