సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాతి నుంచి పెట్రోల్, డీజల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. 9 రోజుల వ్యవధిలో చమురు ధర లీటరుపై సుమారు 70 నుంచి 80 పైసలు పెరిగింది.
సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన తరువాత రోజు(మే 20వ తేదీ) నుంచి పెట్రోల్, డీజల్ ధరలు రోజువారీగా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థల నోటిఫికేషన్ ప్రకారం తొమ్మిది రోజుల వ్యవధిలో పెట్రోల్‌పై లీటర్‌కు 83 పైసలు, డీజల్‌పై 73 పైసలు చొప్పున ధరలు పెరిగాయి.
ఏప్రిల్-మే నెలల్లో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా... భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి.
పెరుగుతూనే ఉంటాయా..
లీటర్ పెట్రోల్ ధర గురువారం 11 పైసలు, డీజల్ ధర 5 పైసలు పెరిగింది.
దేశరాజధాని దిల్లీలో మే 19న రూ.71.03గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర... మంగళవారం నాటికి రూ.71.86కు చేరుకుంది. డీజల్ ధర రూ.65.96 నుంచి రూ.66.69కు పెరిగింది.
ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.77.47గా ఉండగా, డీజల్ ధర రూ.69.88గా ఉంది.
చమురు ధరలపై.... ఎన్నికల ప్రభావమా..!
సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఏప్రిల్- మే నెలల్లో చమురు ధరలు నిలకడగా ఉండేలా ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఉద్దేశపూర్వకంగానే నిర్ణయం తీసుకున్నాయి.
ఎన్నికల సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని... ఇప్పుడు భర్తీ చేసుకునే పనిలో పడ్డాయి చమురు సంస్థలు.
గతంలోనూ ఇలాగే..
2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ చమురు సంస్థలు 19 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను నిలకడగా ఉంచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 5 డాలర్లు పెరిగినా, కర్ణాటకలో మాత్రం ధరలు పెంచలేదు. కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ ధరను లీటర్‌కు రూ3.80లు, డీజల్‌పై రూ.3.38లు పెంచాయి.
2017లో గుజరాత్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే పద్ధతి అవలంభించాయి చమురు సంస్థలు.
ఇదీ చూడండి: కోలుకున్న పీఎన్బీ- 65% తగ్గిన నష్టాలు